గుంటూరు జిల్లా రాయపూడిలో జరిగిన అమరావతి జనభేరి కార్యక్రమానికి వైకాపా, సీపీఎం మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. నేతలంతా అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపారు. బహిరంగసభలో మాట్లాడిన నేతలు వైకాపా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నిజంగా వెనకబడిన ప్రాంతాల మీద జగన్‌కు ప్రేమ ఉంటే శ్రీకాకుళంలో రాజధాని పెట్టాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ప్రకటనతో పబ్బం గడుకోవాలని చూస్తున్న వైకాపా ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు.
ఉత్తరాంధ్రపై జగన్‌ది కపటి ప్రేమ : అచ్చెన్నాయుడు
అమరావతిని హత్య చేసిన సీఎం జగన్... లెంపలేసుకుని క్షమాపణ చెప్పి రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న మహిళల తెగువ స్ఫూర్తిదాయకమన్నారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకే సీఎం ఇవాళ బీసీ సభ పెట్టారని మండిపడ్డారు. అమరావతిలో అత్యధికులు బీసీలేనని జగన్ గుర్తించాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు. ప్రజల్ని మోసగించిన ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రపై జగన్‌ది కపట ప్రేమ అన్న అచ్చెన్నాయుడు..., విశాఖను రాజధాని చేయమని ఎవరడిగారని నిలదీశారు.
ఎప్పటి వరకైనా పోరాడతాం : గల్లా జయదేవ్
రాష్ట్ర భాజపా నేతలు అమరావతికి మద్దతు అంటున్నా...ఆ రీతిలో కేంద్రం స్పందించడం లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. అమరావతి రైతులు అనేక వేధింపులని తట్టుకుని ఉద్యమాన్ని సాగిస్తున్నారన్నారు. అమరావతి రైతుల కోసం ఎప్పటి వరకైనా పోరాడేందుకు సిద్ధమని జయదేవ్ స్పష్టం చేశారు.
రాజధాని అమరావతికే మద్దతు : భాజపా
రైతులకు సంఘీభావం తెలిపేందుకే ఈ సభకు హాజరయ్యామని భాజపా నేతలు స్పష్టంచేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనే భాజపా తీర్మానం చేసిందన్నారు. మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే భాజపా కార్యాలయం ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. రాజధాని ఇక్కడ ఉండేలా భాజపా పోరాడుతుందని స్పష్టం చేశారు.
రాజధాని తరలింపు పిచ్చి తుగ్లక్ చర్య : తులసిరెడ్డి
రాజధాని తరలింపు నిర్ణయం ఓ చారిత్రక తప్పిదమని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. అదొక పిచ్చి తుగ్లక్ చర్య అన్నారు. రాజధాని తరలింపుపై వైకాపా చెప్తున్న కారణాలు సహేతుకంగా లేవని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రత్యేక హోదా సాధించి పోలవరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అంటే వికేంద్రీకరణ తప్ప రాజధాని మార్పు కానేకాదని స్పష్టంచేశారు. బంగారు బాతు లాంటి రాజధానిని మూర్ఖులు తప్ప ఎవ్వరూ వదులుకోలేరని తులసిరెడ్డి విమర్శించారు.
మోదీ ఒక్క మాట చెప్తే జగన్ వెనక్కి తగ్గుతారు : సీపీఐ
మూర్ఖపు ముఖ్యమంత్రి వల్లే రాజధాని పోరాటం ఏడాదిగా సాగుతోందని సీపీఐ నేతలు దుయ్యబట్టారు. అమరావతే రాజధానిగా కొనసాగే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు రాజధాని మారుస్తామని జగన్ ఎక్కడా చెప్పలేదన్నారు. ఏకపక్షంగా తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అని ఒక్క రోజులో రాజధాని తరలింపు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. అమరావతి ఉద్యమాన్ని అవమానపరిచి పోటీ ఉద్యమం చేయిస్తున్నా ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదన్నారు. ఏడాది తర్వాత కూడా రాజధాని ఉద్యమాన్ని గుర్తించకపోవటం జగన్‌కు తగదని హితవు పలికారు. మోదీ ఒక్కమాట చెప్తే జగన్ వెనక్కి తగ్గుతారన్న సీపీఐ నేత రామకృష్ణ... అమరావతిని రాజధానిగా కొనసాగించమని మోదీ జగన్‌కు చెప్పాలని డిమాండ్ చేశారు.
మూడు రాజధానులకు ప్రజా మద్దతు లేదు : జనసేన
అమరావతి జనరణభేరికి జనసేన నేత పోతిన మహేష్ హాజరయ్యారు. అమరావతికి శాశ్వత రాజధాని లేకుండా కుట్ర చేశారని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టాలనే జగన్ కుట్రలో ఎవ్వరూ పడలేదన్నారు. 5 కోట్ల మంది మద్దతు అమరావతికేనని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు ప్రజా మద్దతు లేదని ఆయన వెల్లడించారు. ఏడాదిన్నరలో జగన్ చేసిన అప్పు రూ.లక్ష 30 వేల కోట్లతో ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు.
జనభేరికి సీపీఎం గైర్హాజరు
అమరావతి జనభేరికి సీపీఎం దూరంగా ఉంది. అమరావతి విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న భాజపాను సభకు ఆహ్వానించడం వల్లే హాజరుకాలేదని పేర్కొన్నారు. పరిపాలన రాజధాని అమరావతిలో ఉండాలని సీపీఎం స్పష్టం చేసింది. రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొంది. భవిష్యత్తు కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందన్నా ఆ పార్టీ నేత మధు భాజపా నేతలతో కలిసి వేదిక పంచుకోలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు అమరావతి ఐకాస కన్వీనర్‌కు లేఖ రాశారు.
ఇదీ చదవండి : జనభేరి...అమరావతి ఉద్యమ స్ఫూర్తితో మారుమోగి