What Is Wedding Insurance : పెళ్లి అనేది జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇదొక మధుర జ్ఞాపకంలా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మరి అలా మంచి జ్ఞాపకంలా మార్చుకోవాలంటే మీరు మ్యారేజ్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం చాలా మంచిది. ఏదైనా అనుకోని, ఊహించని నష్టం ఏర్పడితే ఇది మీకు అండగా నిలుస్తుంది.
అసలేంటీ వివాహ బీమా?
వివాహ సమయంలో లేదా వివాహం అయ్యాక ఏదైనా అనుకోని ఘటన, విపత్తు వచ్చినప్పుడు మనల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ వివాహ బీమా ఉపయోగపడుతుంది. వివాహాన్ని రద్దు చేయడం లేదా ఏదైనా ఇతర నష్టం కారణంగా జరిగే భారీ ఖర్చులను ఈ బీమా కవర్ చేస్తుంది. బీమా పాలసీ నాలుగు అంశాలు కలిగి ఉంటుంది. ప్రస్తుతం మనకు ICICI Lombard, Future Generali అనే కంపెనీలు ఈ వివాహ బీమా అందిస్తున్నాయి.
- లయబిలిటీ కవరేజ్ : వివాహ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ నష్టాన్ని వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
- క్యాన్సలేషన్ కవరేజ్ : ఆకస్మికంగా లేదా ఇతర కారణాల వల్ల వివాహాన్ని రద్దు చేయడం వల్ల కలిగే నష్టాల్ని ఇది కవర్ చేస్తుంది.
- డ్యామేజ్ టు ప్రాపర్టీ : మన ఆస్తికి ఏదైనా నష్టం జరిగినప్పుడు కవరేజ్ ఇస్తుంది.
- పర్సనల్ ఆక్సిడెంట్ : ప్రమాదాల కారణంగా వధువు/వరుడు ఆసుపత్రిలో చేరితే, వాటిని కూడా ఇది కవర్ చేస్తుంది.
అగ్ని ప్రమాదం లేదా దొంగతనం కారణాలతో వచ్చే నష్టాన్ని కూడా ఇది కవరేజీ అందిస్తుంది. ముఖ్యంగా వివాహ సమయాల్లో క్యాటరింగ్, వివాహ వేదిక, ట్రావెల్ ఏజెన్సీలకు, హోటల్ రూమ్ బుకింగ్స్, మ్యూజిక్ అండ్ డెకరేషన్ కోసం ఇచ్చిన అడ్వాన్సులు, పెళ్లి పత్రికలకు అయిన ఖర్చు, వెడ్డింగ్ సెట్ కోసం చేసిన డెకరేషన్ ఖర్చులు అన్నీ ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌తో రికవరీ చేసుకోవచ్చు.
పాలసీ దరఖాస్తు ఇలా!
వివాహ బీమా కోసం దరఖాస్తు చేయడం చాలా సింపుల్. ముందుగా మీ అవసరాలను గుర్తించాలి. సరైన వివాహ ప్రణాళికను వేసుకోవాలి. తర్వాత అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో, పాలసీ కంపెనీలు ఇచ్చే దరఖాస్తును నింపి వారికి సమర్పించాలి. ఆ బీమా కంపెనీ మీ వివరాలను వెరిఫై చేసి ప్రీమియం నిర్ణయిస్తుంది. తర్వాత ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు బాధితుడు బీమా సంస్థకు సమాచారమిస్తే, వారు క్లెయిమ్ వివరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. ఇది మొత్తం నష్టాన్ని నివారించలేదు కానీ, కొంత వరకు ఆర్థిక కష్టాల నుంచి మిమ్మల్ని బయట పడేస్తుంది.
పాలసీ క్లెయిమ్ ఇలా!
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాధ్యమైనంత త్వరగా బీమా కంపెనీకి సమాచారమివ్వాలి. క్లెయిమ్ ఫారమ్ నింపి దానికి సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి సమర్పించాలి. పాలసీ కంపెనీ నుంచి ఒక అధికారి వచ్చి డ్యామేజ్‌ను అంచనా వేస్తారు. మీ క్లెయిమ్ సరైనదే అని తేలితే, మీ అకౌంట్లోకి క్లెయిమ్ అమౌంట్ జమ చేస్తారు. లేని పక్షంలో క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు. కొన్నిసార్లు పేమెంట్స్ ఎవరికి ఇవ్వాలనేది బీమా కంపెనీ డిసైడ్ చేస్తుంది. అంటే పాలసీదారునికి నేరుగా డబ్బులు ఇవ్వకుండా, అతను ఎవరిరెవరికి డబ్బులు చెల్లించాలో, వారికి ఇన్సూరెన్స్ కంపెనీయే నేరుగా చెల్లిస్తుంది. ఒకవేళ లబ్ధిదారుడు క్లెయిమ్ అమౌంట్‌తో సంతృప్తి చెందకపోయినా, అయిన ఖర్చు కన్నా తక్కువ వచ్చిందని భావించినా, కచ్చితంగా కోర్టును ఆశ్రయించవచ్చు.
క్లెయిమ్ చేసుకునేందుకు ఏయే పత్రాలు అవసరం?
కంపెనీ వాళ్లు ఇచ్చే దరఖాస్తు ఫారమ్, పాలసీ జిరాక్స్, డ్యామేజ్ అయిన ప్రాపర్టీ వివరాలు, నష్టపోయిన వస్తువుల జాబితా, విలువైన వస్తువులుంటే వాటి కొనుగోలు పత్రాలు లేదా ఇన్-వాయిస్‌లు, ఒకవేళ దొంగతనం లాంటివి జరిగితే, ఎఫ్ఐఆర్ కాపీ, ఆన్లైన్లో కొనుగోలు చేస్తే, క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లు, కొనుగోలు తేదీ, ప్రాంతం వివరాలు సమర్పించాలి. అలాగే డ్యామేజ్ అయిన వాటిల్లో ఏదైనా రికవరీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే, నిపుణుల నుంచి అందుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని తీసుకుని సమర్పించాలి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేందుకు 30 రోజుల నిర్ధిష్ట గడువు ఉంటుంది. అంతకు మించి ఆలస్యం ఉండదు. కంపెనీ ఏదైనా క్లారిఫికేషన్‌కు రావాలన్నా 30 రోజుల్లోపే వచ్చి, అమౌంట్ సెటిల్ చేయాల్సి ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో క్లెయిమ్ చేసుకోలేం!
- టెర్రరిస్ట్ అటాక్
- ధర్నాలు, ఆందోళనలు
- పెళ్లి క్యాన్సిల్ అయినప్పుడు
- వధువు లేదా వరుడు కిడ్నాప్‌నకు గురైనప్పుడు
- పెళ్లికి వచ్చిన అతిథుల దుస్తులు, ఆభరణాలు పోయినప్పుడు లేదా డ్యామేజ్ అయినప్పుడు
- వధువు లేదా వరుడు ఫ్లైట్ లేట్ కావడం వల్ల పెళ్లికి హాజరుకాలేనప్పుడు
- వధువు లేదా వరుడు వివాహ వేదికకు వచ్చే మార్గంలో వాహనం బ్రేక్‌డౌన్ అయినప్పుడు
- పాలసీ హోల్డర్ నిబంధనల్లో పొందుపర్చినట్టుగా కాకుండా, వేదిక డ్యామేజ్ అయినప్పుడు
- ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రేక్‌డౌన్ వల్ల వివాహవేదికకు డ్యామేజ్ అయినప్పుడు
- నిర్లక్ష్యం వల్ల ప్రాపర్టీ డ్యామేజ్ అయినప్పుడు
ఇవి గుర్తుంచుకోండి
- అనుకున్న దానికంటే ఎక్కువ నష్టపోయినా.. ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న పరిమితి మేరకే పరిహారం చెల్లిస్తారు.
- బంధువులు, చుట్టాలు బహుమతిగా ఇచ్చిన ఆభరణాలకే క్లెయిమ్ వర్తిస్తుంది. ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలివే !
- వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది పాలసీ మొత్తంలో 0.7% నుంచి 2% మాత్రమే ఉంటుంది.
- బీమా సంస్థలు ప్రత్యేకమైన పాలసీలను ఆఫర్ చేస్తాయి. వాటిలో మీకు నచ్చిన బీమాను ఎంచుకోవచ్చు. లేదంటే ప్యాకేజీ తీసుకోవచ్చు.
- పబ్లిక్ లయబిలిటీ కవరేజీ ద్వారా ఒక మంచి ప్రయోజనముంది. అదేంటంటే, ఫంక్షన్‌లో ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా కొన్ని కంపెనీలు జాగ్రత్త తీసుకుంటాయి.
బెస్ట్ మైలేజ్ ఇచ్చే కారు కొనాలా? ఈ టాప్-10 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
వర్చువల్ క్రెడిట్ కార్డ్స్‌తో ఆన్లైన్ ఫ్రాడ్స్‌కు చెక్! బెనిఫిట్స్ & లిమిట్స్ ఇవే!