సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తమ ఖాతాదారులను అప్రమత్తం చేసింది. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను తెలుసుకోవడానికి మోసగాళ్లు అనేక మార్గాలను అనుసరిస్తున్నారని... ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు సూచించింది. ముఖ్యంగా పండగ సీజన్ కావడం వల్ల డిజిటల్ లావాదేవీ యాప్‌లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల్ని వినియోగించుకునే సమయంలో జాగ్రత్త వహించాలని స్పష్టం చేసింది.
'మీ ఖాతాలో ఏదైనా అనధికారిక లావాదేవీని గుర్తించినట్లయితే.. వెంటనే మా దృష్టికి తీసుకురావాల'ని ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు సూచించింది. 'నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగివచ్చే అవకాశం ఉంది' అని వెల్లడించింది. తద్వారా బాధితుడి ఖాతా నుంచి బదిలీ అయిన నగదును ఇతర ఖాతాలకు బదిలీ అవ్వకుండా చేయవచ్చని తెలిపింది. సంబంధిత నేరగాళ్ల ఖాతాల్లోని నగదు స్తంభించిపోతుందని పేర్కొంది. 18001234 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
గత నెల ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారా సైతం ఇదే తరహా సూచనలు చేశారు. ఎలాంటి అనుమానిత లావాదేవీలను గుర్తించినా వెంటనే బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. కస్టమర్ సర్వీస్‌ను కూడా ఉపయోగించుకోవచ్చని సూచించారు. టోల్‌ఫ్రీ నంబరుతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, భీమ్ ఎస్‌బీఐ పే లావాదేవీల్లో ఏమైనా అనుమానం ఉంటే బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే కంప్లైట్ నమోదిత నంబరు సహా ఇతర వివరాలు ఎసెమ్మెస్ ద్వారా అందుతాయి. 90 రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తారు.