Reliance Q1 Results 2023 : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. తమ సంస్థలోని కీలక విభాగాల బాధ్యతలను తన ముగ్గురు సంతానానికి గతేడాది అప్పజెప్పారు. పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి రిలయన్స్ జియో బాధ్యతలు.. కుమార్తె ఈశాకు రిలయన్స్ రిటైల్ బాధ్యతలు అప్పగించారు. అలాగే చిన్న కుమారుడు అనంత్‌కు.. న్యూ ఎనర్జీ విభాగాలను అప్పజెప్పారు. గురువారం రిలయన్స్.. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మరి ఆకాశ్, అనంత్, ఈషా.. ఈ ముగ్గురిలో అదరిగొట్టిన వ్యాపారవేత్తలు ఎవరో ఓ సారి తెలుసుకుందాం.
Jio Q1 Results 2023 : రిలయన్స్‌లోని టెలికాం విభాగం త్రైమాసిక ఫలితాల్లో సత్తా చాటింది. ఆకాశ్ అంబానీ నేతృత్వంలోని జియో.. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 12 శాతం వృద్ధితో రూ.4,863 కోట్ల నికర లాభం నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ.21,995 కోట్ల నుంచి రూ.24,127 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 9.9 శాతం మేర పెరిగి రూ.24,042 కోట్లకు చేరింది. అయితే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం జియో లాభాలు.. ఊహించిన దాని కంటే తక్కువగా వచ్చాయి. ఖర్చులు, సుంకాల వ్యయాల పెరుగుదల కారణంగా లాభం తగ్గింది. సంస్థ వ్యయం రూ.17,594 కోట్లకు పెరిగింది.
Reliance Retail q1 Results : ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ సైతం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జోరు చూపించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ 18.8 శాతం వృద్ధితో రూ.2,448 కోట్ల నికర లాభం నమోదు చేసింది. కంపెనీ స్థూల ఆదాయం కూడా 19 శాతం పెరిగి రూ.69,948 కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా 555 రిలయన్స్ కొత్త స్టోర్లను ప్రారంభించింది. మరోవైపు, కొత్త ఫ్యాషన్ కంపెనీలను కొనుగోలు చేసే పనిలో ఇషా అంబానీ బిజీగా ఉన్నారు.
Mukesh Ambani Childrens Whose Best : ఇదిలా ఉంటే రిలయన్స్ కంపెనీకి ప్రధాన వ్యాపార విభాగమైన ఆయిల్ టు కెమికల్స్ (ఓ2సీ) ఈసారి తీవ్రంగా నిరాశపర్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 31% తగ్గడం వల్ల రిలయన్స్ లాభాలకు గండిపడింది. ఈ ప్రభావంతో ఓ2సీ విభాగం ఎబిటా 23.2% క్షీణించి రూ.15,271 కోట్లకు పరిమితమైంది. అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ఓ2సీ పరిధిలోని 'న్యూ ఎనర్జీ'కి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే రిలయన్స్ రిటైల్ విభాగం అధిపతి.. ఇషాయే ఆ సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టారని వాణిజ్య నిపుణులు అంటున్నారు. ఆ తర్వాత ఆకాశ్ అదరగొట్టారని చెబుతున్నారు.