PPF Vs EPF Vs VPF : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF).. ఈ మూడు భారతదేశంలోని ప్రధాన ప్రభుత్వ పదవీ విరమణ పథకాలు. ఈ మూడు రిటైర్మెంట్ ప్లాన్స్‌కు చెందిన.. వడ్డీ రేట్లు, పన్నులు, నిధుల ఉపసంహరణ నిబంధనలు భిన్నంగా ఉంటాయి. మీ ఆర్థిక లక్ష్యాలు, అర్హతలు, పెట్టుబడి సామర్థ్యం, రాబడి, ద్రవ్యత (లిక్విడిటీ) తదితర అంశాలను ఆధారంగా చేసుకుని.. ఈ ప్రభుత్వ పదవీ విరమణ పథకాల్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.
పన్నులు భిన్నం!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, కంపెనీలు లేదా సంస్థలు కచ్చితంగా తమ ఉద్యోగులకు EPF పథకాన్ని అందించాలి. కానీ ఉద్యోగులు ప్రత్యేకించి PPF, VPF పథకాల్లో మదుపు చేయాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన పన్నులు భిన్నంగా ఉంటాయి. అందుకే ఆయా పథకాలను ఎంచుకునే ముందు కచ్చితంగా పన్నులు గురించి కూడా తెలుసుకోవాలి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
Public Provident Fund : భారత ప్రభుత్వం పీపీఎఫ్ పథకాన్ని నిర్వహిస్తోంది. అసలు, వడ్డీ రెండింటికీ ప్రభుత్వ హామీ ఉంటుంది. ఈ పథకం 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ కలిగి ఉంటుంది. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్ ఆదాయంపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో పీపీఎఫ్ అకౌంట్ నుంచి కూడా కొంత మేరకు నగదు ఉపసంహిరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనిపై లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. అయితే గవర్నమెంట్ బాండ్స్ రాబడుల ఆధారంగా .. పీపీఎఫ్ వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్ వార్షిక వడ్డీరేటు 7.1 శాతంగా ఉంది.
పీపీఎఫ్ రాబడులు - పన్ను రహితం
పీపీఎఫ్ పథకంలో ఉన్న మంచి విషయం ఏమిటంటే.. ఇది EEE (మినహాయింపు, మినహాయింపు, మినహాయింపు) కేటగిరీకి వస్తుంది. అంటే పీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బుపై, సంపాదించిన వడ్డీపై, మెచ్యూరిటీ ఆదాయంపై ఎలాంటి పన్నులు ఉండవు. అంటే ఈ మూడూ పన్ను రహిత ఆదాయాలు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్ పథకంలో పెట్టిన పెట్టుబడి మొత్తంపై .. సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF)
Employee Provident Fund : అర్హత కలిగిన సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల జీతం నుంచి కచ్చితంగా ఈపీఎఫ్ డిడక్ట్ అవుతుంది. ఉద్యోగి తన బేసిక్ శాలరీ లేదా డియర్నెస్ అలవెన్స్ (డీఏ)లలో ఏది తక్కువ అయితే దానిలో.. రూ.1800 లేదా 12 శాతాన్ని ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌గా చెల్లించాలి. చాలా కంపెనీలు శాలరీలో 12 శాతం + డీఏను డిడక్ట్ చేస్తాయి. అలాగే ఈ మొత్తానికి సమానమైన సొమ్మును.. ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తాయి. ఉద్యోగుల ఈపీఎఫ్‌ను.. ఎప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది.
ఈపీఎఫ్‌పై పన్ను!
EPF Taxation : 2021 కేంద్ర బడ్జెట్ తరువాత ఈపీఎఫ్ పన్నుల విధానంలో కీలకమైన మార్పులు చేశారు. ఉద్యోగి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని తన వంతు ఈపీఎఫ్గా చెల్లిస్తూ ఉంటే.. దానిపై కచ్చితంగా పన్ను విధిస్తారు. అయితే ఈ వడ్డీ కూడా TDSకు లోబడి ఉంటుంది. అయితే సదరు ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు.. కంపెనీ యజమాని చేసిన కంట్రిబ్యూషన్‌పై ఎలాంటి పన్ను విధించరు. క్లియర్ టాక్స్ ప్రకారం, 2.5 లక్షల ఈపీఎఫ్‌పై విధించే వడ్డీలో.. వీపీఎఫ్ కంట్రిబ్యూషన్ కూడా కలిసి ఉంటుంది.
ఐటీ చట్టంలోని సెక్షన్ 194 A ప్రకారం, రూ.2.5 లక్షల పరిమితి కంటే ఎక్కువ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఉన్న ఖాతాల వడ్డీ ఆదాయంపై 10 శాతం వరకు టీడీఎస్ కట్ అవుతుంది. రెసిడెంట్ ఇండియన్స్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ ఖాతాలో వచ్చే వడ్డీ రూ.5000 దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి.. ఒక ఆర్థిక సంవత్సరంలో యజమాని చెల్లించే ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ రూ.7.5 లక్షలు దాటితే.. దానిపై కూడా టాక్స్ విధిస్తారు. అలాగే ఎన్పీఎఫ్, పదవీ విరమణ నిధులు కూడా రూ.7.5 లక్షలు దాటితే పన్ను విధిస్తారు.
5 ఏళ్లు దాటితే టాక్స్ లేదు!
EPF Lock in Period : ఐదు సంవత్సరాలపాటు క్రమం తప్పకుండా సర్వీస్ చేసిన తరువాత, ఉద్యోగి ఈపీఎఫ్ ఉపసంహిరించుకుంటే.. దానిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా మన ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌పై, దానిపై వచ్చిన వడ్డీపై ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు. కానీ 5 ఏళ్ల నిర్ధిష్ట వ్యవధిలోపు కనుక ఈపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తే.. పన్ను మినహాయింపు లభించదు. అలాగే ముందస్తు ఈపీఎఫ్ ఉపసంహరణ మొత్తంపై 10 శాతం వరకు టీడీఎస్ కట్ అవుతుంది. సెక్షన్ 80సీ ప్రకారం, ఉద్యోగి ఈపీఎఫ్ పథకంలో పెట్టిన పెట్టుబడి మొత్తంపై .. సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF)
Voluntary Provident Fund : ఉద్యోగి స్వచ్ఛందంగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వేళ అతనికి ఇష్టం లేకపోతే VPF పథకంలో చేరకుండా ఉండవచ్చు. అందుకే దీనిని వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అన్నారు. ఒక ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతాకు అందించే 12 శాతం కంట్రిబ్యూషన్ కంటే ఎక్కువగా ఈ వీపీఎఫ్ పథకంలో పెట్టవచ్చు. వాస్తవానికి ఉద్యోగి తన బేసిక్ శాలరీ + డీఏలో 100 శాతం వరకు ఈ వీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం ఈపీఎఫ్‌తో సమానంగా పీపీఎప్కు కూడా వడ్డీ రేట్లు అందిస్తున్నారు. ప్రస్తుతం వీపీఎఫ్ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. వాస్తవానికి VPF పథకం కూడా EEE (మినహాయింపు, మినహాయింపు, మినహాయింపు) కేటగిరీ పరిధిలోకి వస్తుంది. అందువల్ల వీపీఎఫ్ కంట్రిబ్యూషన్, వడ్డీ రేట్లు, అసలు లేదా మెచ్యూరిటీ మొత్తంపై ఎలాంటి పన్నులు విధించడం జరగదు.
EPF Lock in Period : వీపీఎఫ్ పథకం లాకిన్ పీరియడ్ 5 సంవత్సరాలు. ఒక వేళ ఉద్యోగి ఈ 5 ఏళ్ల కంటే ముందుగానే వీపీఎఫ్ ఖాతాలోని డబ్బులు ఉపసంహరించుకుంటే.. దానిపై కచ్చితంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదే 5 సంవత్సరాల పరిమితి తరువాత విత్‌డ్రా చేసుకుంటే.. ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.