'తొలితరం విద్యుత్తు బస్సుల బ్యాటరీలు 3-4 గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించేవి. మేం తయారు చేస్తున్న అధునాతన విద్యుత్తు బస్సుల బ్యాటరీలను రెండున్నర గంటలు ఛార్జింగ్ చేస్తే.. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. వీటితో ప్రజా రవాణా తీరే మారుతుంది. సరకు రవాణా కోసం విద్యుత్తు టిప్పర్లను ఆవిష్కరిస్తున్నాం. డీజిల్ టిప్పర్ల ఇంధన వ్యయంతో పోలిస్తే వీటికి 8 రెట్లు తక్కువ అవుతుంది' అని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.ప్రదీప్ తెలిపారు. అన్ని రకాల విద్యుత్తు వాహనాలకు ఒకేరకం ఛార్జర్ ప్రవేశ పెడుతున్నందున, ఈ రంగానికి అవరోధాలు తగ్గుతాయని తెలిపారు. ముఖ్యాంశాలివీ..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 800 బస్సుల డెలివరీ
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు ఇప్పటివరకు ఉన్న ఆర్డర్లు 3,360. వీటిని 12-18 నెలల్లో డెలివరీ చేయాల్సి ఉంది. మరో 1,000 బస్సులకు ఆర్డర్లు పొందడంలో మేము ఎల్1 బిడ్డర్‌గా ఉన్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద 800 విద్యుత్తు బస్సులను డెలివరీ చేయాలన్నది మా లక్ష్యం. ఏప్రిల్-సెప్టెంబరులో 280 అందించాం. 2017 నుంచి వేర్వేరు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు మేం అందించిన 950కి పైగా బస్సులు 8.5 కోట్ల కి.మీ.కు మించి సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి. సాంకేతిక కారణాలతో బస్సు రోడ్డుమీద ఆగిందనే ఫిర్యాదులు 10 కూడా రాలేదు. వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కోసం దేశవ్యాప్తంగా 50,000 బస్సులకు కొత్త ఏడాదిలో టెండర్లు పిలవనున్నారు. వీటికీ మేమూ బిడ్లు వేస్తాం. కేంద్రప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం 15 ఏళ్లు నిండిన బస్సులను ఆర్టీసీలు తీసివేయాల్సిందే. వీటిస్థానంలో విద్యుత్తు బస్సులకే ప్రాధాన్యమిస్తాయి. 2021లో అన్ని కంపెనీలు కలిసి 1,000 విద్యుత్తు బస్సులను విపణిలోకి తేగా, ఈ ఏడాది ఆ సంఖ్య 2500 -3000కు చేరుతోంది.
నగరాల మధ్య ప్రయాణానికి సరిపోతాయ్
ఒకసారి ఛార్జింగ్‌తో 500 కి.మీ. వెళ్లే అధునాతన ఏసీ విద్యుత్తు బస్సు ధర సుమారు రూ.2 కోట్లు. బెంగళూరు-మైసూర్, ముంబయి-పుణె మధ్య వీటిని కర్ణాటక, మహారాష్ట్ర ఆర్టీసీలు నిర్వహించబోతున్నాయి. డీజిల్ బస్సు కిలోమీటరు ప్రయాణానికి ఆయా సంస్థలకు అవుతున్న ఖర్చు (సిబ్బందితో కలిపి) రూ.120-150 అయితే విద్యుత్తు బస్సు కాంట్రాక్టు ప్రకారం రూ.50-60 మాత్రమే. ఆర్టీసీ రూట్ నిర్ణయించి, కండక్టరును కేటాయిస్తే చాలు.. అంటే నిర్వహణ వ్యయం సగానికిపైగా తగ్గిపోతోంది. ఇన్వెంటరీల భారమూ వారికి ఉండదు. బస్సు నిర్వహణ కాంట్రాక్టు 12 ఏళ్లు ఉంటుంది. బస్సు ధరలో ఫేమ్ పథకం రాయితీ 30% ఉంటుంది కనుక, మా రికవరీ కాలావధి, బస్సు మార్గాన్ని బట్టి ఉంటుంది.
కార్ల ప్రయాణికులనూ ఆకర్షించేందుకే..
కారులోని 70 శాతం సదుపాయాలు విద్యుత్తు ఏసీ బస్సులతో సాధ్యమవుతోంది. వీరిని ఈ బస్సుల్లో ప్రయాణించేలా చూస్తే, వ్యక్తిగత రవాణా వాహనాలు తగ్గి.. ఇంధన ఖర్చు, కాలుష్యం నివారించవచ్చు. సీసీఎస్2 ఛార్జర్లనే అందరూ వాడాలి కనుక, భవిష్యత్తులోనూ ఏ ఛార్జింగ్ స్టేషన్ అయినా వాడుకోవచ్చు. దేశంలో బ్యాటరీ తయారీ ప్రారంభమైతే, బస్సు వ్యయం బాగా దిగి వస్తుంది. బస్సు ధరలో ప్రస్తుతం బ్యాటరీ వాటాయే 40 శాతం.
టిప్పర్లే ఎందుకంటే..?
విద్యుత్తు టిప్పర్ల సామర్థ్యంపై నిర్వహించిన పరీక్షలు విజయవంతమై, హోమలొగేషన్ సర్టిఫికేషన్ జరుగుతోంది. కొత్త ఏడాదిలో వీటిని విపణిలోకి తెస్తాం. బస్సులకు డిపోల్లో ఛార్జింగ్ పెట్టుకుంటారు. కానీ సరకు రవాణా లారీలు, బేరాన్ని బట్టి వేర్వేరు ప్రాంతాలకు వెళ్తాయి. ఇంకా దేశవ్యాప్తంగా ఛార్జింగ్ కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటవ్వలేదు కాబట్టి విద్యుత్తు లారీలను ఆవిష్కరించలేదు. అదే టిప్పర్లు అయితే ప్రాజెక్టు సైట్లలో, గనులు-ఫ్యాక్టరీ నుంచి నియమిత ప్రాంతం వరకే వెళ్తుంటాయి. వీటికి ఛార్జింగ్ కేంద్రాలు పెట్టడం సులువవుతుంది. 150, 200, 275 కి.మీ. ప్రయాణించేలా టిప్పర్లు తయారు చేస్తున్నాం. సిమెంటు రవాణాకు మాత్రం హాలేజీ ట్రక్‌లు (300 కి.మీ. మించి ప్రయాణించేలా) 2023లో ఆవిష్కరిస్తాం. ప్లాంటు నుంచి నిర్దేశిత వాణిజ్య కేంద్రాలకే ఇవి ప్రయాణిస్తాయి కనుక ఇబ్బంది ఉండదు. లీటరు డీజిల్‌పై టిప్పరు అర కిలోమీటరు నడుస్తుంది. అంటే 1 కిలోమీటరుకు 2 లీటర్ల డీజిల్.. సుమారు రూ.200 అవుతుంది. విద్యుత్తు టిప్పరు సుమారు 3.5 యూనిట్ల విద్యుత్తు ఛార్జింగ్‌తో 1 కి.మీ. ప్రయాణిస్తుంది. విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌కు యూనిట్ ధర రూ.6.75 కనుక కిలోమీటరుకు ఖర్చు (6.75్ల3.5) రూ.24 మాత్రమే. టిప్పర్ క్యాబిన్ కూడా ఏసీతో ఉంటుంది. అంటే ఇ-టిప్పర్‌తో పోలిస్తే డీజిల్ టిప్పర్ ఇంధన వ్యయం 8 రెట్లు ఎక్కువ.
రూ.800 కోట్లు తయారీ ప్లాంటు కోసమే..
హైదరాబాద్ సమీపంలోని సీతారాంపూర్‌లో తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 150 ఎకరాల స్థలంలో మానవ ప్రమేయం అతి తక్కువగా, పూర్తిగా యాంత్రీకరణతో నడిచే అత్యాధునిక విద్యుత్తు వాహనాల ప్లాంటును రూ.800 కోట్లతో నిర్మిస్తున్నాం. 2023 చివరికల్లా ఈ ప్లాంటు సిద్ధమవుతుంది. మా పరిశోధన-అభివృద్ధి కేంద్రంలో 50 మందికి పైగా ఇంజినీరింగ్ నిపుణులు పనిచేస్తున్నారు. సెల్స్ చైనా నుంచి బీవైడీ ద్వారా దిగుమతి చేసుకుని, పెరంబదూర్‌లో అసెంబ్లింగ్ చేసుకుంటున్నాం. కొత్త ప్లాంటులో ఛాసిస్ నుంచి ప్రతి విడిభాగం వరకు ఇక్కడే తయారు చేస్తాం. బ్యాటరీ అసెంబ్లింగ్ కూడా ఇక్కడే. ఈ ప్లాంటును తొలుత ఏడాదికి 5,000 బస్సులతో ప్రారంభించి, 2024-25 కల్లా 10,000 బస్సులకు చేర్చాలన్నది ప్రణాళిక.