Netflix password sharing: సబ్స్క్రైబర్లు తగ్గిన నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పాస్వర్డ్ షేరింగ్‌పై ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తక్కువ ధరకే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకుంటే వీడియోల్లో యాడ్స్‌ను ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది.
Netflix subscribers drop: కరోనా సమయంలో నెట్‌ఫ్లిక్స్ పంట పండింది. అందరూ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలపై దృష్టిసారించినందున.. ఈ యాప్‌నకు రికార్డు స్థాయిలో సబ్స్క్రైబర్లు పెరిగారు. యాపిల్, వాల్ట్ డిస్నీ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలను తలదన్నే స్థాయికి చేరింది. సబ్స్క్రైబర్ల సంఖ్యను 22.16 కోట్లకు చేర్చుకుంది. అయితే, ఈ ఏడాది జనవరి- మార్చి కాలంలో నెట్‌ఫ్లిక్స్ కస్టమర్లు భారీగా తగ్గారు. 2లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు నెట్‌ఫ్లిక్స్‌కు దూరమయ్యారు. 25 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లను చేర్చుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా.. అది తలకిందులైంది. ఆరేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఈ స్థాయిలో కస్టమర్లు దూరం కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే నెట్‌ఫ్లిక్స్ పునరాలోచనలో పడింది. ఇప్పటికే రష్యా నుంచి వైదొలిగినందున 7 లక్షల సబ్స్క్రైబర్లు దూరమయ్యారు. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో సంస్థ మరో 20 లక్షల మంది కస్టమర్లు కోల్పోనుందని నెట్‌ఫ్లిక్స్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే దిద్దుబాటు చర్యలకు దిగింది.
Netflix account sharing fee: తమ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఖాతాలను ఉపయోగించి 10 కోట్ల కుటుంబాలు నెట్‌ఫ్లిక్స్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇందులో అమెరికా, కెనడాలోనే మూడు కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వీరిని పూర్తిస్థాయి సబ్స్క్రైబర్లుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది నెట్‌ఫ్లిక్స్. చిలీ, కోస్టారీకా, పెరూ దేశాల్లో అమలు చేస్తున్న ట్రయల్ ప్రోగ్రామ్‌ను విస్తరించేందుకు సన్నహాలు చేస్తోంది. సబ్‌స్క్రిప్షన్‌కు, షేరింగ్‌కు వేర్వేరుగా వసూలు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. కోస్టారీకాలో 9 నుంచి 15 డాలర్ల సబ్స్క్రిప్షన్ ఛార్జీలను వసూలు చేస్తున్న సంస్థ.. మరో వ్యక్తికి అకౌంట్ షేర్ చేసుకునేందుకు 3 డాలర్లు ఛార్జ్ చేస్తోంది. షేరింగ్‌ను మోనెటైజ్ ఎలా చేయాలన్న విషయంపై రెండేళ్ల నుంచి వివిధ ప్రయత్నాలు చేస్తున్నట్లు సంస్థ చెప్పుకొచ్చింది.
Netflix subscription charges: మరోవైపు, యాడ్స్‌తో కూడిన సబ్‌స్క్రిప్షన్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానుంది నెట్‌ఫ్లిక్స్. సాధారణ సబ్‌స్క్రిప్షన్‌తో పోలిస్తే తక్కువ ధరకే.. ఈ సర్వీసును ప్రవేశపెట్టనుంది. డిస్నీ+హాట్‌స్టార్, హెచ్‌బీఓ తరహాలో వీడియో మధ్యలో యాడ్స్ ప్లే చేయనుంది. తగ్గించిన సబ్స్క్రిప్షన్ ధర వల్ల కోల్పోయిన ఆదాయాన్ని యాడ్స్ ద్వారా సమకూర్చుకోనుంది.
మరోవైపు, భారీస్థాయిలో సబ్స్క్రిప్షన్స్ కోల్పోయిన నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ షేర్లు పాతాళానికి పడిపోయాయి. షేరు విలువ దాదాపు 25 శాతం మేర నష్టపోయింది. ప్రస్తుతం భారత్‌లో ప్రీమియం నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ సబ్స్క్రిప్షన్ ఛార్జీ నెలకు రూ.649గా ఉంది. దీని ద్వారా నాలుగు వేర్వేరు డివైజ్‌లలో ఖాతాను ఉపయోగించుకోవచ్చు. అయితే, ఇతర ప్లాట్‌ఫాంలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. డిస్నీ + హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ రూ.1,499కే ఏడాది పాటు సేవలు అందిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఐదు వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్.. సెన్సెక్స్ 570 ప్లస్