Multiple Credit Cards Benefits : పండగల వేళ చాలా మంది క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోళ్లు చేస్తుంటారు. కొందరికి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటాయి. వాస్తవానికి ఎక్కువ సంఖ్యలో క్రెడిట్ కార్డులున్న యూజర్లు.. వాటిని సరైన ప్లానింగ్‌తో ఉపయోగించుకోవాలి. అప్పుడే ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి వీలవుతుంది. పైగా క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. లేకుండా ఆర్థిక ఇబ్బందులు తప్పవు.
సరైన ప్రణాళికతో..
ఆర్థిక ప్రణాళికలో క్రెడిట్ కార్డుల నిర్వహణ అనేది చాలా కీలకమైనది. వాస్తవానికి క్రెడిట్ కార్డు వినియోగించి కొనుగోళ్లు చేస్తే, రాయితీలు, రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. అయితే అవసరమైన వస్తువులు కొనడానికి మాత్రమే వీటిని ఉపయోగించాలి. ఆఫర్స్ ఉన్నాయి కదా అని.. అవసరం లేని వస్తు, సేవలను కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డులను వినియోగిస్తే.. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కనుక ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్న వారు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అవసరానికి తగ్గట్టుగా..
వ్యక్తుల అర్హతలు, అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు, రుణ సంస్థలు క్రెడిట్ కార్డులను ఇస్తుంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు ట్రావెల్ సంస్థలతో ఒప్పందాలున్న కార్డులను తీసుకోవచ్చు. కొనుగోళ్లు ఎక్కువగా చేసే వారు క్యాష్ బ్యాక్, రాయితీలు అధికంగా ఇస్తున్న కార్డులను ఎంపిక చేసుకుంటే మంచిది. ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారు కూడా ఇదే సూత్రాన్ని పాటించాలి. అదే సమయంలోనూ గరిష్ఠంగా మూడు కార్డులకు మించి ఉండకూడదనే కండిషన్‌ను పాటించాలి. కార్డులు పెరుగుతున్న కొద్దీ.. అప్పులు కూడా పెరుగుతాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా ఒకటి లేదా రెండు క్రెడిట్ కార్డులను తీసుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మీ అవసరమూ తీరుతుంది.. ఎక్కువ కార్డులను నిర్వహించాల్సిన పని భారం కూడా తగ్గుతుంది.
రివార్డులు వచ్చేలా..
క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు జరిపేటప్పుడు రివార్డుల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఉదాహరణకు కొన్ని కార్డులు పెట్రోలు కొనుగోలు చేసే సమయంలో కొంత రాయితీని ఇస్తాయి. మరికొన్ని.. ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుపై క్యాష్ బ్యాక్ సౌకర్యాన్ని అందిస్తాయి. పలు హోటళ్లతో ఒప్పందం ఉన్న కార్డులు సైతం ఉంటాయి. వీటి ద్వారా చాలా తక్కువ ధరకే హోటల్ బుకింగ్స్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు చాలా సంస్థలు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అందువల్ల ఎక్కువ రివార్డులు, ప్రయోజనాలు ఉన్న కార్డులను తీసుకునేందుకు ప్రయత్నం చేయండి. కాకపోతే మీ అవసరాలకు అనుగుణంగానే కార్డులను ఎంపిక చేసుకోవాలి.
వ్యవధిని అర్థం చేసుకోండి..
క్రెడిట్ కార్డులు ఎక్కువ ఉన్నప్పుడు దేన్ని, ఏ సందర్భంలో వాడాలనే విషయంలో ఫుల్ క్లారిటీ ఉండాలి. ముఖ్యంగా వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు బిల్లింగ్ తేదీని కచ్చితంగా చూసుకోవాలి. సదరు బిల్లులను సకాలంలో చెల్లించాలి. వాస్తవానికి క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై ఎలాంటి వడ్డీని చెల్లించకూడదు అనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అదే సమయంలో వీలైనంత ఎక్కువ రీపేమెంట్ వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు బిల్లింగ్ తేదీ ముగిసిన మరుసటి రోజు వస్తువులను కొనుగోలు చేయాలి. అప్పుడు మీకు దాదాపు 45 రోజుల వరకూ వ్యవధి లభిస్తుంది. కార్డులకు వేర్వేరు బిల్లింగ్ తేదీలు ఉండేలా జాగ్రత్తపడాలి. ఏదైనా సందర్భంలో కార్డు బిల్లును చెల్లించనట్లయితే.. మరో క్రెడిట్ కార్డు నుంచి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లాంటి సదుపాయాన్ని వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. దీనివల్ల వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు అవకాశం లభిస్తుంది.
30 శాతానికి మించకుండా..
ఇక మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి విషయానికి వస్తే.. మొత్తం ఖర్చులకు ఒకే కార్డును వినియోగించకూడదు. మీ దగ్గరున్న అన్ని కార్డులనూ వాడుకునే ప్రయత్నం చేయాలి. ఒక కార్డుపై ఉన్న పరిమితిలో గరిష్ఠంగా 30-40 శాతానికి మించి వినియోగించకుండా జాగ్రత్తపడాలి. మీ క్రెడిట్ కార్డు వినియోగ నిష్పత్తి ఎంత తక్కువగా ఉంటే.. అంత మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు కూడా పెరుగుతుంది.
ముఖ్యంగా పండగల వేళ క్రెడిట్ కార్డులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. డబ్బు లేకుండా కొనే వెసులుబాటు ఉన్నా.. తర్వాత బిల్లులు చెల్లించాల్సింది మీరేనన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. పైగా క్రెడిట్ స్కోరు దెబ్బతింటే.. రుణాలు రావడం కష్టమవుతుంది. ఒక వేళ రుణం పొందగలిగినా.. ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
How To Get Business Loan : బిజినెస్ లోన్ కావాలా?.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!
Income Tax Investment Plan : ఆదాయం ఎక్కువగా.. పన్ను తక్కువగా ఉండాలా?.. ఇలా ప్లాన్ చేసుకోండి!