Investment Strategies : వ్యక్తులు తమ ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడులుగా పెట్టి మంచి రాబడి సంపాదించాలని ఆశిస్తుంటారు. ఇందుకోసం స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, బంగారం మొదలైన పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ అన్ని రంగాల్లో ఒకే విధమైన రాబడులు రావు. మార్కెట్లో ఆయా రంగాలకు ఏర్పడే డిమాండ్ ఆధారంగా లాభనష్టాలు వస్తుంటాయి.
వృద్ధి బాటలో ఈక్విటీలు
Equity market trends : దేశీయ ఈక్విటీ మార్కెట్లు గత 20 ఏళ్లలో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. మొత్తంగా చూసుకుంటే మదుపరులకు మంచి లాభాలనే ఆర్జించి పెట్టాయి. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల క్రితం దేశీయ ఈక్విటీల్లో రూ.50,000 పెట్టుబడి పెట్టి ఉంటే.. అది ఇప్పటికి సుమారుగా రూ.12,00,000కు పెరిగేది. అదే మీరు బంగారంపై రూ.50 వేలు పెట్టుబడి పెట్టి ఉంటే.. 20 ఏళ్ల తరువాత మీకు రూ.4.80 లక్షలు మాత్రమే వచ్చేది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే కేవలం రూ.2.55 లక్షలు మాత్రమే 20 ఏళ్లలో సంపాదించి ఉండేవారు.
పసిడి పెట్టుబడులు
Gold Investments : భారతదేశంలో బంగారానికి ఉన్నంత డిమాండ్, ప్రాధాన్యత మరో లోహానికి లేదు. నేటి కాలంలో భౌతికంగా బంగారంతో పాటు డిజిటల్ గోల్డ్, గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఫండ్స్‌లలో కూడా ప్రజలు తమ పెట్టుబడులు పెడుతున్నారు.
ఉదాహరణకు 2013లో 10 గ్రాముల బంగారాన్ని రూ.29,000లకు కొనుగోలు చేశారనుకుందాం. 2023 మే నెలాఖరు నాటికి ఆ బంగారం విలువ రూ.56,000కు పెరిగింది. అంటే మీరు పెట్టిన పెట్టుబడిపై 90 శాతం వరకు రాబడి వచ్చింది. అంటే బంగారంపై సగటు వార్షిక రాబడి 9 శాతం వరకు వచ్చింది. దీనిని బాగా పరిశీలిస్తే.. సగటు ద్రవ్యోల్బణం కంటే బంగారంపై వచ్చిన ఆదాయం ఎక్కువగా ఉంది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు
Real Estate Investments : రియల్ ఎస్టేట్ రంగంలో ధరలు అనేవి చాలా వేగంగా మారిపోతుంటాయి. భూమి ఉన్న ప్రాంతం, సౌకర్యాలు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి, ప్రజల మోజు.. ఇవన్నీ కూడా రేట్లను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి డిమాండ్ ఉంది. ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా వరకు రియల్ ఎస్టేట్ హవా నడుస్తోంది. కానీ దేశమంతటా అన్ని వేళలా రియల్ ఎస్టేట్ ఒకే రకంగా ఉంటుందని చెప్పలేం. ఈ రంగంలో ఒడుదొడుకులు చాలా ఎక్కువ. గత 20 ఏళ్ల కాలాన్ని చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో వార్షిక రాబడి కేవలం 5 నుంచి 9 శాతం మాత్రమే ఉంది. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ రంగంలో లిక్విడిటీ చాలా పరిమితంగా ఉంటుంది.
బ్యాంకు ఎఫ్డీలు
Fixed Deposits in Banks : ఇప్పటికీ చాలా మంది సంప్రదాయ మదుపరులు తమ దగ్గర ఉన్న సొమ్మును తీసుకెళ్లి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం రిస్క్ లేకపోవడం. సీనియర్ సిటిజన్లు, గ్రామీణ ప్రాంత మహిళలు, మార్కెట్లపై అవగాహన లేనివారు, రిస్క్ తీసుకోవడానికి భయపడేవారు.. బ్యాంకుల్లో తమ డబ్బులను పొదుపు చేస్తూ ఉంటారు. గత 20 ఏళ్లలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన సగటు రాబడి కేవలం 6.50 నుంచి 7 శాతం మాత్రమే. ఇది ద్రవ్యోల్బణంతో పోల్చి చూస్తే చాలా తక్కువ.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
Public Provident Fund : పోస్టు ఆఫీస్ పథకాల్లో బాగా పాపులర్ పథకాల్లో.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ప్రధానమైనది. ఇందులో 15 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ తరువాత కూడా మరో 5 సంవత్సరాలు చొప్పున పెట్టుబడి కొనసాగించడానికి అవకాశం ఉంది.
గత 20 ఏళ్ల కాలాన్ని తీసుకుంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వలన వచ్చిన సగటు వార్షిక రాబడి సుమారుగా 7.50 నుంచి 8 శాతం వరకు ఉంది. వాస్తవానికి ఇది కూడా సగటు ద్రవ్యోల్బణం కంటే కాస్త తక్కువే అని చెప్పవచ్చు. దీనిలో ఉన్న మంచి విషయం ఏమిటంటే.. ఇది ప్రభుత్వ పథకం కనుక మీరు చేసిన మదుపు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్
Mutual Funds Investment and Risks : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పూర్తిగా మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. వాస్తవానికి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టినంత మాత్రాన కచ్చితంగా లాభాలు వస్తాయని చెప్పలేం కూడా. చాలా మంది ఈ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తుంటారు. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
ఇండెక్స్ | వార్షిక రాబడులు (శాతంలో) 2023 మే 31 వరకు | |||||
1 సంవత్సరం | 3 సంవత్సరాలు | 5 సంవత్సరాలు | 10 సంవత్సరాలు | 15 సంవత్సరాలు | 20 సంవత్సరాలు | |
ఈక్విటీ (నిఫ్టీ 50) టీఆర్ఐ | 12.9 | 26.1 | 12.9 | 13.3 | 10.6 | 17.2 |
బంగారం | 14.2 | 7.6 | 13.1 | 7.5 | 10.3 | 12 |
డెట్ | 6.5 | 5.5 | 6.8 | 7.4 | 7.5 | 7.5 |