Indian Oil Cuts Jet Fuel Price: విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ ధరల్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బుధవారం తగ్గించింది. ఈ ఏడాది ధరల్ని తగ్గించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర 1.3 శాతం తగ్గి రూ.1.21 లక్షలకు చేరింది.
మే 16న ఏటీఎఫ్ ధరలు 5 శాతం పెరగడం వల్ల కిలోలీటర్ ధర రూ.1.23 లక్షలకు చేరింది. ఈ ఏడాది ఆరంభంలో రూ.72,062గా ఉన్న కిలోలీటర్ విమాన ఇంధన ధర భారీగా పెరిగి రూ.1.23 లక్షల వద్ద జీవనకాల గరిష్ఠానికి చేరింది. దాదాపు 62 శాతం పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ ఆ ప్రభావం కనిపించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత సరఫరా సమస్యలు తలెత్తి ధరలు మరింత ఎగబాకాయి. భారత్ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది.
విమానయాన వ్యయాల్లో 40 శాతం వాటా ఇంధనానిదే. దీంతో ఇంధన ధరలు పెరిగినా.. తగ్గినా.. ఆ ప్రభావం విమాన ప్రయాణాలపై ఉంటుంది. ఈ ఏడాది మార్చి 16న గరిష్ఠంగా ఏటీఎఫ్ ధరను 18.3 శాతం పెంచారు. ఏప్రిల్ 1న రెండు శాతం, ఏప్రిల్ 16న 0.2 శాతం, మే 1న 3.22 శాతం చొప్పున ధరలు పెరిగాయి. మొత్తంగా ఈ ఏడాదిలో ధరలు 10 సార్లు ఎగబాకాయి.
ఇదీ చూడండి: భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర!