Flight prices decrease : పండగ సెలవుల్లో సన్నిహితులను కలుసుకునేందుకు ఆసక్తి చూపడం సహజం. ముఖ్యంగా దసరా-దీపావళి పండుగల సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉండే కుటుంబ సభ్యులు కూడా ఒక్కచోట చేరి, ఆనందోత్సాహాలతో గడిపేందుకు మొగ్గు చూపుతారు. ఈ సందర్భంలోనే విమాన ఛార్జీలు తగ్గడమూ కలిసి వస్తోంది. టికెట్ ధరలపై పరిమితులు తొలగించడానికి తోడు సంస్థల మధ్య పోటీ పెరిగిన నేపథ్యంలో.. మే నెలతో పోలిస్తే ఛార్జీలు సగటున 30 శాతం తగ్గాయని ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ యాత్రా.కామ్ వెల్లడించింది. ముంబయి-బెంగళూరు, దిల్లీ-ముంబయి వంటి రద్దీ మార్గాల్లో అయితే వేసవి సెలవుల కంటే టికెట్ ధరలు 40-70 శాతం దిగివచ్చినట్లు తెలిపింది.
కొవిడ్ కేసుల ఫలితంగా విమాన సేవలను నిలిపి మళ్లీ ప్రారంభించాక, టికెట్ ధరలకు గరిష్ఠ, కనిష్ఠ పరిమితుల్ని 2020 మేలో ప్రభుత్వం విధించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్నందున, ఆగస్టు 31 నుంచి ఈ పరిమితులను తొలగించడమూ ఛార్జీలు తగ్గేందుకు ఉపకరించిందని నివేదిక పేర్కొంది. ముడిచమురు ధరలు గరిష్ఠస్థాయి నుంచి దిగి రావడమూ కలిసి వస్తోంది. 'పండుగ రోజులకు ముందు కూడా టికెట్ ధరలు కొన్ని నెలల క్రితం నాటి ధరలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. అయితే గిరాకీపై ఆధారపడి ఈ తగ్గింపు ఉంది' అని యాత్రా.కామ్ వైస్ ప్రెసిడెంట్ భరత్ మాలిక్ వెల్లడించారు.
- దిల్లీ-ముంబయి విమాన టికెట్ ధర మేలో రూ.9,000 ఉండగా.. ఇప్పుడు 40 శాతం తగ్గి రూ.5,500కు పరిమితమైంది.
- ముంబయి-బెంగళూరు మధ్య మేలో టికెట్ ధర రూ.8,500 కాగా, ఇప్పుడు 75 శాతం తగ్గి రూ.2,000 సమీపంలో ఉంది.
- దిల్లీ-బెంగళూరు టికెట్ మేలో రూ.10,000 పలకగా, ఇప్పుడు రూ.7,000కు తగ్గిందని సంస్థ పేర్కొంది.
పండగలు సమీపించే కొద్దీ పెరగొచ్చు
'ధరల ఉపశమనం కొంతకాలం ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నాం. పండుగలు సమీపించే కొద్దీ ధరలు పెరిగే అవకాశం ఉంది. కాకపోతే కొవిడ్ ముందు స్థాయికి మాత్రం ధరలు చేరకపోవచ్చు. ఇంధన ధరలు, విమానయాన సంస్థలు నమోదు చేసిన నష్టాలు, ఇతర అంశాలు కీలకంగా ఉండనున్నాయి. ఈ సమయంలో పండుగ ఒప్పందాలు కొంత సౌకర్యవంతంగా ఉండొచ్చు' అని ఈజ్‌మైట్రిప్ సీఈఓ, సహ వ్యవస్థాపకులు నిశాంత్ పిట్టీ వివరించారు. విమాన టికెట్ ధరలు దిగి వచ్చినందున, విమాన ప్రయాణికులు మళ్లీ రైలు ప్రయాణాలకు అంత తొందరగా మారరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ దిల్లీ-ముంబయి విమాన టికెట్ ధర మళ్లీ రూ.9,000కు చేరితే నలుగురు సభ్యులున్న కుటుంబం వెళ్లి, వచ్చేందుకు సుమారు రూ.72,000 వరకు అవుతుంది. అదే రైల్లో సెకండ్ ఏసీ ప్రయాణానికి రూ.32,000-33,000 అవుతుందని గుర్తు చేస్తున్నారు.