సురక్షితమైన పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు పొందేందుకు ఉన్న మార్గం బ్యాంకులు అందించే ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లు. రాబడికి హామీ ఉండటంతోపాటు, వడ్డీ రేట్లు 7 శాతం దరిదాపుల్లో ఉన్న నేపథ్యంలో చాలామందిని ఇవి ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారూ వీటిని పరిశీలించవచ్చు.
ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 80సీ ప్రకారం వివిధ పన్ను ఆదా పథకాల్లో మదుపు చేసినప్పుడు రూ.1,50,000 వరకూ మినహాయింపు లభిస్తుంది. ఈ పథకాల్లో ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లూ ఒకటి. వీటిలో జమ చేసిన మొత్తాన్ని సెక్షన్ 80సీ పరిమితి మేరకు క్లెయిం చేసుకోవచ్చు.
- వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇప్పటికే మీ ఖాతా ఉన్న బ్యాంకులో లేదా ఇతర బ్యాంకులోనూ ఈ ఎఫ్డీని ప్రారంభించవచ్చు.
- ఈ డిపాజిట్లపై వచ్చిన వడ్డీని మొత్తం ఆదాయంలో కలిపి చూపించాలి. వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాలి.
- ఒక బ్యాంకులో వేసిన డిపాజిట్ నుంచి ఆర్థిక సంవత్సరంలో రూ.40వేలకు మించి వడ్డీ వచ్చినప్పుడు టీడీఎస్ చేస్తారు. ఫారం 15జీ, ఫారం 15 హెచ్ ఇవ్వడం ద్వారా టీడీఎస్ నుంచి మినహాయింపు పొందవచ్చు.
- సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై వచ్చే వడ్డీ ఆదాయం రూ.50వేల వరకూ పన్ను ఉండదు.
- పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లకు వ్యవధి అయిదేళ్లు. గడువుకు ముందు వీటి నుంచి డబ్బు వెనక్కి తీయడం సాధ్యం కాదు. హామీగా ఉంచి రుణమూ తీసుకోలేం.
- ఈ డిపాజిట్లపై వడ్డీ రేటు బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది.