How To Resolve Failed UPI Payments : భారతదేశంలో నేడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా సులువుగా ఆర్థిక లావాదేవీలు జరిగిపోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించిన ఈ యూపీఐ ద్వారా సింపుల్‌గా మీ చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తో.. రియల్ టైమ్‌లో డబ్బులు పంపించడానికి లేదా స్వీకరించడానికి వీలు అవుతోంది. అయితే కొన్ని సార్లు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలు
UPI Transaction Fail Resolving Process :
- బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవాలి : యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే.. వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవాలి. చాలా సార్లు బ్యాంక్ ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఒక వేళ మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఉండి కూడా.. ఆర్థిక లావాదేవీలు ఫెయిల్ అయితే.. వెంటనే సదరు బ్యాంక్ కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి, వివరాలు తెలుసుకోవాలి.
- ట్రాన్సాక్షన్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలి : మీరు యూపీఐ ద్వారా ఆర్థిక లావాదేవీలు చేసే ప్రతిసారీ.. NPCI యూనిక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ (UTR) నంబర్‌ను జనరేట్ చేస్తుంది. కనుక దీనిని ఉపయోగించి మీ ట్రాన్సాక్షన్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలి. ఒక వేళ మీ ట్రాన్సాక్షన్ స్టేటస్ పెండింగ్‌లో ఉన్నట్లయితే.. ప్రాసెసింగ్ కావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఇలాంటి సమయంలో మీరు కొంత సమయంపాటు వేచి చూడాల్సిందే!
- బ్యాంక్‌ను సంప్రదించాలి : కొన్ని సార్లు యూపీఐ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపినప్పుడు డబ్బులు కట్ అయిపోతాయి. కానీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో.. వెంటనే బ్యాంకును సంప్రదించాలి. లేదా యూపీఐ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి. ముఖ్యంగా మీ డబ్బులు మీకు వెనక్కు రావాలంటే.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ, యూటీఆర్ నంబర్, ట్రాన్సాక్షన్ తేదీ, సమయం మొదలైన వివరాలను బ్యాంకులకు కచ్చితంగా తెలియజేయాలి.
- కంప్లైంట్ నమోదు చేయాలి : సాధారణంగా అన్ని బ్యాంకులు కూడా.. బ్యాంకింగ్ సమస్యలను తీర్చడం కోసం కస్టమర్ కేర్ సర్వీస్ లేదా హెల్ప్లైన్లను ఏర్పాటు చేస్తాయి. వీటి ద్వారా మీరు ఫిర్యాదు చేయాలి. ఒక వేళ నిర్దిష్ట సమయంలోపు మీ సమస్య తీరకపోతే.. అప్పుడు కంప్లైంట్ ఫైల్ చేయాలి. అలాగే భవిష్యత్‌లో రిఫరెన్స్ కోసం.. మీరు చేసిన ఫిర్యాదు తాలూకు పత్రాలు లేదా రికార్డులు అన్నింటినీ భద్రపరుచుకోవాలి.
- ఎన్‌పీసీఐకు ఫిర్యాదు చేయాలి : ఒక వేళ మీ సమస్య పరిష్కారం కాకపోతే.. NPCIకు ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే.. యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలు అన్నింటినీ ఎన్పీసీఐ పరిశీలిస్తుంది, నిర్వహిస్తుంది.
- అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేయాలి : బ్యాంకు వద్ద, అలాగే ఎన్పీసీఐ వద్ద కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకకపోతే.. వెంటనే మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ వద్ద ఫిర్యాదు చేయాలి. ఆర్బీఐ ప్రత్యేకంగా బ్యాంకింగ్ సమస్యలను తీర్చడం కోసం.. ఈ అంబుడ్స్‌మెన్ వ్యవస్థను ఏర్పాటుచేసింది. కనుక ఈ అంబుడ్స్‌మెన్ వ్యవస్థ కస్టమర్లకు కచ్చితంగా సహాయం చేసుంది. పరిష్కారం చూపిస్తుంది.
- సహనం వహించాలి : యూపీఐ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్ సర్వీసుల్లో వచ్చే సమస్యలు కొన్నిసార్లు సులువుగా తీరిపోవచ్చు. కొన్ని సార్లు సమస్యల పరిష్కారానికి చాలా సమయం పట్టవచ్చు. కనుక కస్టమర్లు కాస్త సహనం వహించాల్సి ఉంటుంది.
- కొన్ని సార్లు సాంకేతిక సమస్యల వల్ల కూడా బ్యాంకింగ్ వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఇలాంటి సమయంలో మీరు కంగారు పడకూడదు. అవసరమైతే, మీ సన్నిహితుల సహాయం తీసుకోవాలి. మీరు కూడా టెక్నాలజీ అవేర్నెస్ను పెంపొందించుకోవాలి.