ప్రముఖ వ్యాపార సంస్థ హిందూజా గ్రూప్ ఛైర్మన్ శ్రీచంద్ పర్మానంద్ హిందూజా(87) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం లండన్‌లో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హిందూజా సోదరుల్లో శ్రీచంద్ పర్మానంద్ హిందూజా పెద్దవారు. గోపీచంద్, ప్రకాశ్, అశోక్ హిందూజాలు ఈయన సోదరులు. ఎస్పీ హిందుజా మరణంపట్ల ఆయన సోదరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. భారత సంతతికి చెందిన హిందూజా కుటుంబం బ్రిటన్‌లో స్థిరపడింది. వాణిజ్య పరంగా బ్రిటన్, భారత్ మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో ఎస్పీ హిందూజా కీలకంగా వ్యవహరించారని కుటుంబంలోని ఓ వ్యక్తి తెలిపారు.
ఎస్పీ హిందూజా 1935 నవంబర్ 28న బ్రిటిష్ ఇండియాలోని సింధ్ ప్రావిన్స్‌లోని కరాచీలో ఒక వ్యాపార కుటుంబంలో జన్మించారు. 1952లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అనంతరం ఎస్పీ హిందూజా గ్రూప్ వ్యవస్థాపకుడైన తన తండ్రి పరమానంద్ దీప్‌చంద్ హిందుజాతో కలిసి వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. హిందూజాకు ఇద్దరు కుమార్తెలు షాను, వినూ ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ఎస్పీ హిందూజా సతీమణి మధు (82) మరణించారు.
హిందూజా వ్యాపార సామ్రాజ్యం!
ఆటోమోటివ్, ఆయిల్, స్పెషాలిటీ కెమికల్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఐటీ అనుబంధ రంగాలు, సైబర్ సెక్యూరిటీ, హెల్త్‌కేర్, ట్రేడింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్, మీడియా అండ్ఎంటర్టైన్మెంట్, పవర్ అండ్ రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది హిందూజా గ్రూప్.
బోఫోర్స్ స్కామ్‌లో ఆరోపణలు!
సోదరులు గోపీచంద్, ప్రకాష్‌లు స్వీడిష్ గన్‌మేకర్ అయిన AB బోఫోర్స్ కంపెనీకి భారత ప్రభుత్వ తరఫున కాంట్రాక్ట్ రావడంలో వీరిద్దరి ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో దాదాపు రూ.64 కోట్ల ముడుపులు వీరికి అందాయని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు 2005లో వీరిని నిర్దోషులుగా ప్రకటించింది.
అత్యంత ధనవంతుల్లో ఒకరిగా!
1964లో రాజ్ కపూర్ నటించిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'సంగం' చిత్రానికి సంబంధించి అంతర్జాతీయంగా డిస్ట్రిబ్యూషన్ హక్కులతో హిందూజా వ్యాపార విజయ ప్రస్థానం ప్రారంభమైంది. ఈ సినిమా ఆయనకు మిలియన్ డాలర్ల సంపాదనను తెచ్చేపెట్టింది. దీంతో ఆయన బ్రిటన్‌లోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు. అయితే బోఫోర్స్ స్కామ్ శ్రీచంద్ పర్మానంద్ హిందూజాను అపఖ్యాతి పాలయ్యేలా చేసింది. 2006లో హిందూజా సోదరులు లండన్‌లోని కార్ల్‌టన్ హౌస్ టెర్రేస్ స్ట్రీట్‌లో 25 పడక గదుల భవనం కోసం ఏకంగా 58 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.