Forbes List Nirmala Seetaraman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల జాబితాలో మరోసారి చోటు సాధించారు. దేశంలో మొత్తం ఆరుగురికి చోటు దక్కగా.. అందులో నిర్మలా సీతారామన్ తొలి స్థానంలో నిలిచారు.
ఆమెతో పాటు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజూందర్ షా, నైకా వ్యవస్థాపకులు ఫల్గుణి నాయర్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా, సెబీ ఛైర్‌పర్సన్ మధాబి పురి బచ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్ సోమ మొండల్ ఈ జాబితాలో చోటు సంపాదించారు. పరపతి, మీడియా, ప్రభావం, ప్రభావిత రంగాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ తెలిపింది.
- శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ తొలిసారి 2019లో చోటు దక్కించుకున్నారు. ఆ ఏడాది ఆమెకు 34వ ర్యాంక్ దక్కింది. 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానం సాధించిన ఆమె.. ఈ సారి 36 స్థానంతో వరుసగా నాలుగోసారీ చోటు దక్కించుకున్నారు.
- ఫల్గుణి నాయర్ గతేడాది 88వ స్థానంలో నిలవగా.. ఈ సారి 89వ స్థానం సాధించారు. మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అయిన ఫల్గుణి ఉద్యోగాన్ని వదులుకుని, 2012లో నైకాను ప్రారంభించారు. సంస్థ ఐపీఓ విజయవంతం రావడంతో దేశీయంగా అత్యంత సంపన్న మహిళగా ఆమె అవతరించారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
- రోష్నీ నాడార్ ఈ జాబితాలో 53వ ర్యాంక్ సాధించారు. గతేడాది ఆమె 52వ ర్యాంక్‌లో నిలిచారు. తండ్రి శివ్ నాడార్ స్థాపించిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో రోష్నీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫోర్బ్స్ పేర్కొంది.
- మజుందర్ షా గతేడాదితో పాటు ఈ ఏడాది సైతం 72వ ర్యాంక్‌లో నిలిచారు.
- మదాబి పురి బచ్ 54, సోమ మొండల్ 67వ స్థానంలో నిలిచినట్లు ఫోర్బ్స్ తెలిపింది. సెబీ, సెయిల్‌కు వీరిద్దరూ తొలి మహిళా ఛైర్‌పర్సన్లుగా ఉన్నారు.
- ఈ జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డేర్ తొలిస్థానంలో నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్డే రెండో స్థానంలోనూ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మూడో స్థానంలో నిలిచారు.
- ఇరాన్‌లో ఛాందసవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు కారణమైన మాసా అమీనీ ఈ జాబితాలో 100 స్థానంలో నిలిచారు. 22 ఏళ్ల అమినీ హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదని నైతిక పోలీసులు ఈ ఏడాది సెప్టెంబరు 13న అరెస్టు చేశారు. జైల్లో చిత్రహింసలను తట్టుకోలేక అదే నెల 16న అమీనీ మరణించింది. దీంతో దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి.
- ఇవీ చదవండి:
- VIVOకు షాక్.. 27వేల ఫోన్ల ఎగుమతులకు కేంద్రం బ్రేక్
- మళ్లీ వడ్డీ రేట్ల పెంపు.. ఈఎంఐలు మరింత భారం