గతకొంత కాలంగా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటు, రివర్స్ రెపోరేటును సవరిస్తూ వస్తోంది. దీంతో భారతదేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు వడ్డీ రేట్లను గతంలో లేని విధంగా పెంచాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులనే తేడా లేకుండా అన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లును అధిక శాతం పెంచాయి. అయితే ప్రభుత్వం రెపోరేటు బేసిక్ పాయింట్లను పెంచినందున అన్ని బ్యాంకులతో పాటు.. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతరు రుణ సంస్థలు అవి అందిస్తున్న అన్ని రకాల లోన్స్‌పై వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో రుణ గ్రహీతలపై ఈఎమ్ఐ భారం పడింది.
ప్రస్తుత కాలంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. ఇటువంటి సమయంలో కొంతమేర పొదుపు చేసుకుంటే మంచిదని అందరూ భావిస్తున్నారు. దీనికోసం అని రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. దీనిలో భాగంగా ఎక్కువ మంది తమ కష్టార్జితాన్ని ఎఫ్డీలో పొదుపు చేస్తే మంచిదా లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టబడి పెడితే మంచిదా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఎందులో పెట్టుబడి పెడితే మన డబ్బు సేఫ్‌గా ఉంటుందో, ఎందులో అధిక లాభాలు వస్తాయో తెలుసుకుందామా.
ఎఫ్డీ, సిప్ రెండింట్లో ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..?
ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకునే వారు ముందుగా ఎంచుకునే పొదుపు మార్గం ఫిక్స్డ్ డిపాజిట్లు. అంతర్జాతీయ మార్కెట్లలో ఎటువంటి మార్పులు వచ్చినా సరే.. వీటిలో పెట్టిన పెట్టుబడులపై ఆ ప్రభావం ఉండదు. దీంతో ఏ బ్యాంక్ అధిక వడ్డీ రేటును అందిస్తుందో తెలుసుకుని అందులో పెట్టుబడి పెట్టవచ్చు. వీటిని అవసరమైనప్పుడు తీసుకునే సదుపాయం కూడా ఉంది.
అదే సిప్(క్రమానుగత పెట్టుబడి విధానం)లో పెట్టుబడి పెట్టిన మొత్తానికి కొంతమేర రిస్క్ ఉంటుంది. దీర్ఝకాలిక పెట్టుబడుదారులకు అయితే లాభం చేకూరుతుంది కానీ.. స్వల్పకాలిక పెట్టుబడుదారుల విషయంలో మాత్రం రిజల్ట్ అనేది మార్కెట్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కాలంలో సిప్‌లో స్వల్పకాలిక పెట్టుబడి పెడితే.. మార్కెట్లో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నందున లాభం కంటే నష్టం వాటిల్లే ప్రమాదమే ఎక్కువ ఉందని నిపుణులు అంటున్నారు. సిప్‌లో కనీసం 10 సంవత్సరాలకు పైగా పెట్టుబడి కొనసాగిస్తానని నిర్ణయించుకున్నాకే ముందడుగు వేయాలని సూచిస్తున్నారు. అయితే వీటిలో రాబడి ఎంత శాతం మేర వస్తుందనేదాన్ని ముందుగా అంచనా వేయలేమని వెల్లడించారు.
ప్రస్తుత కాలంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. దీనికి తోడు ఆర్థిక మాంద్యం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు ఆశించనంత ఫలితాలను నమోదు చేయలేక అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయాల్లో సిప్‌లో కంటే.. అధిక వడ్డీలను అందించే బ్యాంకుల్లో ఎఫ్‌డీల్లో పొదుపు చేయడమే ఉత్తమమైన మార్గం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్డీలపై అధిక వడ్డీని అందించే బ్యాంకుల వివరాలు మీకోసమే..
ఎఫ్డీలపై 9.50 శాతం వరకు వడ్డీని అందించే బ్యాంకుల జాబితా..
పంజాబ్ & సింధ్ బ్యాంక్:
222 రోజుల కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ రెండు బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 8.50 శాతం వడ్డీరేటును అందిస్తున్నాయి. దీంతోపాటుగా సాధారణ ప్రజలకు 8 శాతం మేర వడ్డీను ఇస్తున్నాయి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్లకు 444 రోజుల కాలవ్యవధి కలిగిన ఎఫ్డీలపై 8.10 శాతం వడ్డీను అందిస్తుంది. సాధారణ పెట్టుబడిదారులు ఇదే కాలపరమితి గల ఎఫ్‌డీల్లో మదుపు చేస్తే.. వారికి 7.60 శాతం వడ్డీని ఇస్తుంది ఈ బ్యాంక్.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:
ఈ చిన్న బ్యాంకు తమ వద్ద 700 రోజులు కాల పరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లలో మదుపు చేసే సాధారణ ప్రజలకు 8.25 శాతం వడ్డీను అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 9 శాతం వడ్డీరేటును ఇస్తుంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:
ఈ యూనిటీ స్మాల్ పైనాన్స్ బ్యాంక్‌లో.. 1001 రోజల కాల వ్యవధిగల ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టే సాధారణ ప్రజలకు 9 శాతం వడ్డీను అందిస్తున్నాయి. వృద్ధులకు అయితే 9.50 శాతం మేర వడ్డీరేటును ఇస్తుంది.
ఇవీ చదవండి:
హీరో సూపర్ స్ల్పెండర్ XTEC ఫీచర్స్ అదుర్స్.. బడ్జెట్ ధరలో లాంఛ్