2007 నుంచి 2022లో మధ్య మీరు ఎప్పుడైన ఫేస్బుక్లో యాక్టివ్ యూజర్‌గా ఉన్నారా? అయితే రూ.6వేల కోట్లలో మీ షేర్ తీసుకోవడానికి మీరు అర్హులే. ఎందుకంటే ఫేస్బుక్ అనలిటికా కుంభకోణంలో.. యూజర్లందరికీ ఫేస్బుక్ పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీ వాటాను క్లెయిన్ చేసుకోండిలా..
వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించిందనే ఆరోపణలతో ఫేస్‌బుక్‌పై గతంలో కేసు నమోదైంది. ప్రముఖ బ్రిటిష్ పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాతో పాటు ఇతర థర్డ్ పార్టీ వ్యక్తులు/సంస్థలు.. యూజర్ల వ్యక్తిగత డేటాను యాక్సెక్ చేసేలా ఫేస్బుక్ వీలు కల్పించిందని ఆరోపణలు వచ్చాయి. మొత్తం 8.7 కోట్ల మంది యూజర్ల ప్రైవేటు సమాచారం లీక్ అయిందని తేలింది. అప్పట్లో ఈ విషయంపై అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. నాలుగేళ్ల న్యాయ పోరాటం తర్వాత.. యూజర్లకు 725 మిలియన్ల (సుమారు రూ.6వేల కోట్లు) పరిహారం అందించడానికి ఫేస్బుక్ గతేడాది డిసెంబర్లో ఒప్పుకుంది. ఈ కేసులో సెటింల్మెంట్ చేసుకునేందుకు కాలిఫోర్నియా కోర్టు జడ్జి ప్రాథమిక ఆమోదం తెలిపారు. దీంతో, ఫేస్బుక్ ఇచ్చే పరిహారం కోసం క్లెయిమ్ చేసుకునేందుకు వినియోగదారులకు వీలు కలిగింది.
దరఖాస్తు ఇలా చేసుకోవాలి..
పరిహారంలో వాటా కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. వినియోగదారులు కొన్ని వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. facebookuserprivacysettlement.com వెబ్‌సైట్‌కు వెళ్లి Submit Claim పైన క్లిక్ చేయాలి. అనంతరం ఒక ఆన్లైన్ ఫారం నింపాలి. లేదంటే దాన్ని ప్రింట్ తీసి పోస్ట్ చేయొచ్చు. ఆన్లైన్లో అయితే.. ఫామ్ నింపడానికి కొన్ని నిమిషాలు మాత్రమే వ్యవధి ఉంటుంది. పోస్ట్‌ను ఆగస్టు 25 లోపు సమర్పించాలి.
వీళ్లే అర్హులు..
2007 మే 24 నుంచి 2022 డిసెంబర్ 22 మధ్య ఎప్పుడైనా యాక్టివ్‌గా ఉన్న ఫేస్బుక్ యూజర్లు.. దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. అయితే, మీరు ప్రస్తుతం ఫేస్బుక్ వాడకపోయినా.. అకౌంట్లను తొలగించినా.. క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవరికి ఎంత చెల్లిస్తారనే విషయంపై స్పష్టత లేదు. పైన ఉన్న తేదీల మధ్య మీరు ఎంతకాలం ఫేస్బుక్ అకౌంట్‌ను కలిగిఉన్నారనే దాని ఆధారంగా.. చెల్లింపులు చేసే అవకాశముంది. సెటిల్మెంట్కు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆమోదం తెలిపిన తర్వాత... చెల్లింపులు చేస్తారని సమాచారం.
కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణం నేపథ్యంలో.. ఫేస్బుక్ గోప్యతపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవసీ విధానంలో చాలా మార్పులు తీసుకువచ్చింది. 'మా కమ్యూనిటీ, షేర్ హోల్డర్ల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మేము సెటిల్మెంట్కు అంగీకరించాం' అని మెటా ప్రతినిధి ఒకరు గతేడాది డిసెంబర్లో జరిగిన సెటిల్మెంట్ ఒప్పందం తర్వాత ఓ ప్రకటనలో తెలిపారు. గత మూడేళ్లుగా తమ గోప్యతా విధానాన్ని పునరుద్ధరించినట్లు చెప్పారు. గోప్యత విధానాలను అనుసరించేలా.. పటిష్ఠ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.