Edible Oil Import Duty: ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్) నూనె, మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్ నూనెల దిగుమతిపై కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌లను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనెల దిగుమతికి ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంటే 2024 మార్చి 31 వరకు మొత్తం 80 లక్షల మెట్రిక్ టన్నుల నూనెల దిగుమతికి పన్ను భారం ఉండదు. దేశీయంగా వంటనూనెల ధరల మంట తగి,్గ ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేందుకు ఇది దోహదపడనుంది. దిగుమతుల కోటా కోసం మే 27 నుంచి జూన్ 18 లోపుగా సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ కోటాకు మించి దిగుమతి చేసుకునే నూనెలకు సుంకాలు మామూలుగా వర్తిస్తాయి.
లీటరుకు రూ.3 తగ్గుతుంది: ప్రస్తుతం వంటనూనెలపై కస్టమ్స్ సుంకంతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్ పేరిట 5.5% వసూలు చేస్తున్నారు. తాజా ప్రకటనతో సోయాబీన్ నూనె ధర లీటరుకు రూ.3 తగ్గుతుందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల టన్నుల ముడి సోయాబీన్ నూనె, 16-18 లక్షల టన్నుల ముడి సన్‌ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకోవచ్చని అంచనా వేశారు. రైస్‌బ్రాన్ ఆయిల్, కనోలా నూనెల పైనా దిగుమతి సుంకం రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే పామాయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తొలగించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల రవాణా ఛార్జీల రూపేణ కొంత ఉపశమనం లభిస్తోంది.
10 మి.టన్నుల వరకే చక్కెర ఎగుమతులు!: ప్రస్తుత సంవత్సరంలో చక్కెర ఎగుమతులను 10 మిలియన్ టన్నులకే ప్రభుత్వం పరిమితం చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దేశీయంగా తగినంత చక్కెర నిల్వలను అందుబాటులో ఉంచి, ధరలు పెరగకుండా చూసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. చక్కెర ఎగుమతులపై ప్రభుత్వం పరిమితులు విధించడం గత ఆరేళ్లలో ఇదే మొదటిసారి. 2021-22 మార్కెటింగ్ సంవత్సరం (అక్టోబరు-సెప్టెంబరు)లో ఇప్పటివరకు 9 మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతుల కోసం మిల్లులకు అప్పగించారు. ఇందులో 7.5 మిలియన్ టన్నుల చక్కెరను ఇప్పటికే ఎగుమతి చేశారు. సెప్టెంబరు ఆఖరుకు దేశీయంగా 60 లక్షల టన్నుల పంచదార నిల్వ ఉండేలా ప్రభుత్వం చూడనుంది. 2022-23 మార్కెటింగ్ ఏడాది తొలి 2-3 నెలల్లో (పండగ సీజన్) గిరాకీ అధికంగా ఉండటమే ఇందుకు కారణం. 2020-21లో 7 మిలియన్ టన్నుల పంచదారను మన దేశం ఎగుమతి చేసింది.
ఇదీ చూడండి: 'ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్ల పెంపు అనివార్యం'