విజయ బ్రాండు పేరుతో ఆయిల్‌ఫెడ్ వంటనూనెలను విక్రయిస్తోంది. కరోనా మొదలయ్యాక ఒకదశలో లీటరు పొద్దుతిరుగుడునూనె రూ.210కి చేరింది. ఇప్పుడది రూ.175కి దిగివచ్చింది. ప్రపంచ మార్కెట్‌లో ఉక్రెయిన్, రష్యాల నుంచే ఈ నూనె అధికంగా వస్తోంది. అక్కడ యుద్ధం వల్ల రెండు నెలల క్రితం ధర గరిష్ఠ స్థాయికి చేరింది. క్రమంగా రష్యా నుంచి ఎగుమతులు పెరగడంతో పొద్దుతిరుగుడునూనె ధరల తగ్గాయి. ఇతర నూనెలపైనా ఇది ప్రభావం చూపింది. ఏప్రిల్‌లో శుద్ధిచేసిన(రిఫైన్డ్) పామాయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించిన ఇండోనేసియా ఈ నెలలో వాటిని తొలగించడంతో పెద్దయెత్తున ఇండియాకు దిగుమతి అవుతోంది. గతంలో ఒకదశలో లీటరు పామాయిల్ ధర రూ.170కి చేరగా ఇప్పుడు రూ.139కి దిగివచ్చింది. ఇది త్వరలోనే రూ.125కన్నా దిగువకూ రావచ్చని ఆయిల్‌ఫెడ్ అధికారులు ‘ఈనాడు’కు చెప్పారు. తెలంగాణలో వాడే వంటనూనెల్లో సగానికి పైగా పామాయిల్ ఉన్నందున దాని ధరలు తగ్గితే మిగతావీ దిగివస్తాయని వారు వివరించారు. గతేడాది(2021) మే నెలలో ఆయిల్‌ఫెడ్ 2600 టన్నుల వంటనూనెలు విక్రయించగా ఈ ఏడాది(2022) మేలో 3200 టన్నులు అమ్మింది. ఇందులో సగానికి సగం పామాయిల్ ఉంది. ప్రస్తుతం దేశంలో వేరుసెనగలకు కొరత ఉన్నందున పల్లీనూనె ధర పెద్దగా తగ్గడం లేదు. పొద్దుతిరుగుడు, పల్లీనూనెల ధరలు అధికంగా ఉండటంతో మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాలు అమెరికా, ఐరోపా దేశాల నుంచి సోయానూనెను దిగుమతి చేసుకుంటున్నాయి. ఫలితంగా ఇతర నూనెల ధరలూ తగ్గుతున్నాయి.
ఆయిల్‌పాం పంటధర తగ్గనుందా?
ఇండోనేసియా, మలేసియాల నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లోకి వచ్చే పామాయిల్ ధరలను బట్టి మనదేశంలో ఆయిల్‌పాం పంటకు ధరను నిర్ణయిస్తున్నారు. ఆ మేరకు రైతులకు పామాయిల్ మిల్లులు చెల్లిస్తున్నాయి. గరిష్ఠంగా ఈ నెలలో అయిల్‌పాం పండ్లగెలలకు టన్నుకు రూ.23,467 చొప్పున ఇస్తున్నారు. పక్షం రోజులుగా పామాయిల్ ధరలు పడిపోతున్నందున జులై ఒకటి నుంచి టన్నుపంటకు ఇచ్చే ధర రూ.2వేలకు పైగా తగ్గే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు వివరించాయి.
ఇవీ చూడండి: