2000 Note Withdrawn : నగదు నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. నిర్దేశిత గడువు అయిన సెప్టెంబర్ 30లోపు రూ.2వేల నోట్లు అన్నీ వెనక్కు వచ్చేస్తాయని అంచనా వేస్తున్నట్లు ఆయన మీడియాతో చెప్పారు. రూ.2వేల నోట్ల చట్టబద్ధత మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రూ.2వేల నోట్ల డిపాజిట్ సమయంలో రూ. 50వేలు మించితే పాన్ కార్డు తప్పనిసరి అని వివరించారు. రూ.2వేల నోట్ల ఉపసంహరణ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై చాలా తక్కువగా ఉంటుందని శక్తికాంతదాస్ తెలిపారు. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో కొరతను అధిగమించేందుకే రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టినట్లు ఆయన వ్యాఖ్యానించారు. పలు దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, కొన్ని అమెరికా బ్యాంకులు సమస్యల్లో చిక్కుకున్నప్పటికీ.. భారత కరెన్సీ నిర్వహణ వ్యవస్థ చాలా సమర్థంగా ఉందని పేర్కొన్నారు.
"రిజర్వుబ్యాంకు నగదు నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగా రూ.2వేల నోట్లను వెనక్కు తీసుకున్నాం. మరకలు పడిన, మట్టి కొట్టుకొని పోయిన, చిరిగిన నోట్లను ఆర్బీఐ మార్కెట్లో ఉంచదు. అందులో భాగంగా చాలా కాలం నుంచి నోట్ల శుద్ధీకరణ విధానం అనుసరిస్తోంది. అందుకే అప్పుడప్పుడు కొన్ని సిరీస్‌లు ఉన్న నోట్లను వెనక్కు తీసుకొని కొత్త నోట్లను జారీ చేస్తోంది. 2013-14లోనూ ఇలాంటి కసరత్తే చేశారు. 2005కు ముందు ముద్రించిన నోట్లను వెనక్కు తీసుకున్నారు. కొత్త నోట్లు జారీచేశారు. అలాగే ప్రస్తుతం రూ.2వేల నోట్లను వెనక్కు తీసుకుంటున్నాం. వాటి చట్టబద్ధత మాత్రం కొనసాగుతుంది."
--శక్తికాంత దాస్, ఆర్‌బీఐ గవర్నర్
రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్ సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉన్నట్లు దాస్ తెలిపారు. ఆ నిబంధన రూ.2వేల నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. మే 23 నుంచి బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రూ.2వేల నోట్ల స్థానంలో ఇతర నోట్లను ఇచ్చేందుకు తగినంత నగదు అందుబాటులో ఉంచామన్నారు. ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా తక్కువని తెలిపారు. చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2వేల నోట్ల వాటా కేవలం 10.18 శాతం మాత్రమేనని వెల్లడించారు. రూ.1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టనున్నారని వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు.
గుర్తింపు కార్డులు లేకుండా డిపాజిట్లను అనుమతిస్తే.. నల్లధనాన్ని ఎలా గుర్తిస్తారనే ప్రశ్నకు దాస్ స్పందించారు. డిపాజిట్ల విషయంలో ఇప్పటికే అవలంబిస్తున్న నిబంధనలనే రూ.2వేల నోట్ల డిపాజిట్లకూ వర్తింపజేయాలని బ్యాంకులకు సూచించినట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో అయ్యే డిపాజిట్లను తనిఖీ చేసే అంశాన్ని ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో బ్యాంకులకు నిర్దిష్టమైన నిబంధనలను ఉన్నాయని.. వాటినే ఇప్పుడూ అమలు చేస్తాయని స్పష్టం చేశారు.
2000 Note Exchange Rules : రూ. 2వేల నోట్ల మార్పిడికి సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆదివారం కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి చేసుకున్నప్పుడు ఎలాంటి గుర్తింపు పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎటువంటి ఫామ్ నింపాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. ఒకసారి గరిష్ఠంగా రూ.20 వేల విలువ చేసే రూ. 2వేల నోట్లు డిపాజిట్ చేయటం లేదా మార్పిడి చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.