కరోనా మహమ్మారి నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న దేశాలకు అండగా నిలిచేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చర్యలు చేపట్టింది. శుక్రవారం నాటికి 70 దేశాలకు అత్యవసర నిధుల కింద 25 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించినట్లు సంస్థ అధికార ప్రతినిధి గ్యారీ రైస్ వెల్లడించారు. ఈ నిధులను కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఆయా దేశాలకు అందించినట్లు తెలిపారు.
"రోజుల వ్యవధిలోనే దేశాలకు ఈ అత్యవసర సాయాన్ని దేశాలకు అందించగలిగాం. ఐఎంఎఫ్ నిబంధనలను అమలుచేయకుండా ఈ సాయం చేశాం. నర్సులు, వైద్యుల జీతాలు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన వస్తువులు, వైద్య సామగ్రి సమకూర్చుకునేందుకు ఈ మొత్తాన్ని వినియోగించాలి."
-గ్యారీ రైస్, ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఏడు దేశాలకు 1.5 బిలియన్ డాలర్ల సాయం అందజేశామన్నారు. సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతంలోని 28 దేశాలకు 10 బిలియన్ డాలర్లు అందించామని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 100 దేశాలు అత్యవసర నిధుల కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంస్థ అత్యవసర నిధిని రెట్టింపు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: మనిషిని బట్టి డిప్రెషన్ మారుతుంది!