ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే మానిటైజేషన్(నిరుపయోగంగా ఉన్న ఆస్తులను విక్రయించడం)తో పాటు సరైన పద్ధతిలో ద్రవ్య లోటు పెంపు దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వానికి సూచించారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్.
ఇప్పటికే కేంద్రం.. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆదాయ వనరుల నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు సమీకరించి ఖజాన నింపుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మార్కెట్ రుణాల కార్యక్రమం ద్వారా సేకరించాలనుకున్న నిధుల అంచనాలను 54 శాతం (రూ.12 లక్షల కోట్లకు) పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ అంచనా రూ.7.8 లక్షల కోట్లుగా ఉంది.
తగినంత కరెన్సీ ముద్రణ..
ప్రభుత్వ వ్యయాలపై అవరోధం లేకుండా ఆర్బీఐ కావాల్సినంత కరెన్సీ ముద్రించాలని రాజన్ సూచించారు. ప్రభుత్వం మాత్రం ఆర్థిక వ్యవస్థను కాపాడుతూ అవసరమైన వాటికి మాత్రమే వ్యయాలు చేయాలని.. అనవసర ఖర్చులు తగ్గించాలని సూచించారు.
స్వీయ ఆర్థిక ప్రోత్సాహం లేదా మానిటైజేషన్ భయాలు ఆర్థిక వ్యవస్థకు అవరోధాలుగా మారకూడదని రాజన్ అభిప్రాయపడ్డారు. మానిటైజేషన్ అనేది ఆర్థిక వ్యవస్థను వెంటనే పరుగులు పెట్టించేది కాదని అన్నారు. అదే సమయంలో పూర్తిగా విపత్తులోకి నెట్టేది కూడా కాదని పేర్కొన్నారు. అయితే భారత్ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు రాజన్.
ఇదీ చూడండి:ఆర్థిక పునరుత్తేజానికి చైనా పాఠాలు భారత్కు లాభించేనా?