ప్రస్తుతం డిజిటల్ పేమెంట్లు సర్వ సాధారణమయ్యాయి. చాలా మంది కరెంట్ బిల్, టీవీ బిల్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్ బిల్లు, ఇతర ఈఎంఐల వంటి వాటికి.. ఆటో డెబిట్ (Auto payment) సదుపాయం వినియోగించుకుంటున్నారు. ఏదైనా బిల్లు గడువు తేదీ మరిచిపోయినా.. అది సమస్యగా మారకుండా ఈ ఆటో డెబిట్ సదుపాయం ఎంతగానో (How auto pay works) ఉపయోగపడుతుంది.
అయితే ఇకపై ఆటో డెబిట్ సదుపాయం వినియోగించుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే.. ఆటో డెబిట్ రూల్స్‌లో భారీ మార్పులు రానున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఇకపై ఆటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్‌కు అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్‌ఏ) అవసరం. అక్టోబర్ 1 నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయని ఆర్బీఐ గతంలోనే స్పష్టం చేసింది.
అక్టోబర్ 1 నుంచి ఆటో డెబిట్ ఇలా..
రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఓటీపీ అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్‌ఏ) అవసరమవుతుంది.
ఆటో డెబిట్ తేదీకి కొన్ని రోజుల ముందే పేమెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడికి పంపిస్తాయి బ్యాంకులు.
పేమెంట్ కొనసాగించాలనుకుంటే.. ఓటీపీతో ఆ పేమెంట్‌ను నిర్ధరించాలి. లేదంటే పేమెంట్ పూర్తవదు. అప్పుడు మాన్యువల్‌గా లావాదేవీని పూర్తి చేయాల్సి ఉంటుంది.
అన్ని రకాల క్రెడిట్, డెబిట్ కార్డులకు దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు ఈ రూల్స్ వర్తిస్తాయి.
ఆరు నెలలు ఆలస్యంగా..
నిజానికి ఈ కొత్త విధానాన్ని 2019 ఆగస్టులోనే రూపొందించింది ఆర్బీఐ. 2021 ఏప్రిల్ నుంచి అమలులోకి (RBI new guidelines for auto debit) తీసుకురావాలని కూడా ప్రయత్నించింది. తొలుత రూ.2 వేలు దాటిన లావాదేవీలకు కొత్త రూల్స్ వర్తింపజేయాలని నిర్ణయించింది. అయితే రిటైల్ బ్యాంకులు చేసిన అభ్యర్థన మేరకు ఈ నిబంధనల అమలును ఆరు నెలలు వాయిదా వేయడం సహా.. పేమెంట్ కనీస మొత్తాన్ని రూ.5 వేలకు పెంచింది. గడువు తర్వాత ఈ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది.
కొత్త రూల్స్ గురించి ఇప్పటికే పలు రిటైల్ బ్యాంకులు తమ ఖాతాదారులకు సందేశాల రూపంలో సమాచారం ఇస్తున్నాయి. కొత్త రూల్స్‌తో వచ్చే మార్పులు, ఆటో డెబిట్‌ను ఇకపై ఎలా ఉపయోగించుకోవాలనే వివరాలను కూడా వినియోగదారులకు పంపిస్తున్నాయి.
ఇదీ చదవండి: వచ్చే నెల నుంచి ఆ బ్యాంకుల చెక్‌బుక్‌లు పనిచేయవు!