ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఏదైనా కొనాలని అనుకున్నప్పుడు క్రెడిట్ కార్డుల వినియోగం సర్వసాధారణం అయ్యింది. కొంతమంది బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా.. కనీస బాకీని చెల్లిస్తుంటారు. ఇది ఎప్పుడూ సరికాదు. ఒకేసారి చెల్లిస్తే.. ఎలాంటి వడ్డీలు ఉండవు. కనీస మొత్తం చెల్లిస్తే.. వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కార్డును వినియోగించేవారు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. క్రెడిట్ స్కోరును పెంచుకోవాలని భావించే వారికీ క్రెడిట్ కార్డు ఉపయోగకరమే. ఈ కార్డుల వాడకంలో కొన్ని అపోహలు, వాటిలోని వాస్తవాలు తెలుసుకుందాం...
డెబిట్ కార్డు ఉందిగా..
డిజిటల్ చెల్లింపుల కోసం డెబిట్ కార్డు ఉంది కదా.. మళ్లీ క్రెడిట్ కార్డు అవసరం ఏమిటి? అనే సందేహం వస్తుంటుంది. డెబిట్ కార్డును వాడినప్పుడు మీ బ్యాంకు ఖాతాలో డబ్బు ఉండాలి. ఇలా లేని సందర్భాల్లో వినియోగించేందుకే క్రెడిట్ కార్డు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని వాడటం వల్ల చెల్లింపులో సౌలభ్యం ఉండటంతోపాటు, రివార్డు పాయింట్లు, ఇతర ప్రయోజనాలనూ పొందేందుకు వీలవుతుంది.
అర్హత తగ్గుతుందా..
క్రెడిట్ కార్డు బిల్లులు సరిగా చెల్లించకపోతే.. భవిష్యత్‌లో రుణాలు రావడం కష్టమవుతుందని అనేది కొందరి భావన. కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. గడువు తేదీ నాటికి ముందే క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తూ వెళ్తే.. మీ రుణ అర్హతపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. కనీస చెల్లింపు మొత్తమైనా సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోరులో తేడా ఉండదు. గడవు తేదీ తర్వాత, లేదా పూర్తిగా చెల్లించకపోవడంతోనే క్రెడిట్ స్కోరు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
ఒక కార్డు చాలదా?
వినియోగదారులు తమ ఖర్చులకు అనుగుణంగా క్రెడిట్ కార్డులను ఎంచుకునే సౌలభ్యం ఉందిప్పుడు. ఎన్నో కార్డు సంస్థలు తమ వినియోగదారుల అవసరాలకు వినూత్న కార్డులను అందిస్తున్నాయి. తరచూ ప్రయాణాలు చేసే వారికి ఒక కార్డు ఉపయోగపడితే.. కొనుగోళ్లు ఎక్కువగా చేసే వారికి రివార్డులు ఇచ్చే కార్డు ప్రయోజనం. కాబట్టి, ఒక వ్యక్తి దగ్గర గరిష్ఠంగా 2-3 కార్డుల వరకూ ఉన్నా ఇబ్బంది లేదనే చెప్పొచ్చు. అవసరాలను బట్టి, దేన్ని ఉపయోగించాలనే విషయంలో స్పష్టత ఉండాలి.
మోసాలకు ఆస్కారం ఎక్కువ?
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. ఇది క్రెడిట్ కార్డులకూ వర్తిస్తుంది. మీ కార్డు వివరాలు, పిన్, ఓటీపీలాంటివి ఎవరికీ చెప్పొద్దు. నమ్మకమైన మొబైల్ యాప్‌లను మాత్రమే వినియోగించాలి. సంక్షిప్త సందేశాల రూపంలో వచ్చిన లింకులను క్లిక్ చేసేముందు అప్రమత్తంగా ఉండాలి.
మీ క్రెడిట్ పరిమితి గురించి అవగాహన ఉండాలి. కార్డును ఎందుకు వాడుతున్నామన్న విషయంలో కాస్త క్రమశిక్షణా అవసరం. అప్పుడే క్రెడిట్ కార్డుల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ప్రయోజనాలను పొందగలం.
- సంజీవ్ మోఘే, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, యాక్సిస్ బ్యాంక్
ఇదీ చదవండి: JioPhone Next: రూ.500కే జియో స్మార్ట్ఫోన్?