ఏటీఎంల వద్ద జరిగే మోసాలను నివారించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) విధానాన్ని తీసుకొచ్చింది. ఏటీఎంల వద్ద జరిగే అనధికారిక లావాదేవీల నుంచి ఖాతాదారులకు ఈ విధానం రక్షణ కల్పిస్తుంది. రూ.10 వేలు, అంతకంటే ఎక్కువ మొత్తంలో నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డుతో పాటు ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ విధానం.. మోసగాళ్ల నుంచి ఖాతాదారులకు రక్షణ కల్పిస్తుందని ఎస్‌బీఐ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే ఈ విధానం ఎస్‌బీఐ ఏటీఎంల వద్ద మాత్రమే అందుబాటులో ఉంది.
ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
- ఈ విధానంలో ఎస్‌బీఐ ఏటీఎంల వద్ద నగదు విత్‌డ్రా చేసేందుకు ఓటీపీ అవసరం.
- ఖాతాదారుడు బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ అనేది నాలుగు అంకెల సంఖ్య. ఒకసారి వచ్చిన ఓటీపీ ఒక లావాదేవీకి మాత్రమే పనిచేస్తుంది.
- ఏటీఎంలో కార్డు ఇన్‌సర్ట్ చేసి, డెబిట్ కార్డు పిన్ నంబర్, విత్‌డ్రా మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలని అడుగుతుంది.
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తేనే క్యాష్ వస్తుంది.
ఇదీ చూడండి: గూగుల్ పేలో ఎస్‌బీఐ ఆరోగ్య బీమా పాలసీ!