డిజిటల్ పేమెంట్స్ సులభతరం చేసేందుకు కేంద్రం ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఈమేరకు 'ఈ-రూపీ' విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆవిష్కరించనున్నారు. వర్చువల్‌గా ఈ కార్యక్రమం జరుగనుంది.
'ఈ-రూపీ' అంటే..
'ఈ-రూపీ' అంటే నగదు రహిత లావాదేవీ కోసం కేంద్రం తీసుకొస్తున్న కొత్త పేమెంట్ విధానం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, నేషనల్ హెల్త్ అథారిటీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సంయుక్తంగా 'ఈ-రూపీ' విధానాన్ని రూపొందించింది. నగదు రహిత లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఈ విధానాన్ని అమలు చేయనుంది.
లావాదేవి ఎలా?
- క్యూ ఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ వోచర్‌ను లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కు పంపిస్తారు. ఈ కోడ్‌ను లేదా వోచర్‌ను ఒకేసారి వినియోగించాలి. అయితే.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, డిజిటల్ పేమెంట్స్ యాప్ అవసరం లేకుండానే ఈ లావాదేవీ చేయొచ్చని కేంద్రం తెలిపింది.
- లావాదేవి పూర్తయిన తర్వాతే సర్వీస్ ప్రొవైడర్‌కు నగదు చేరుతుంది. ముందుగానే పేమెంట్ జరిగినప్పటికీ.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే సకాలంలో నగదు సర్వీస్ ప్రొవైడర్‌కు చేరతుంది.
- కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ఈ-రూపీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. శిశు సంక్షేమం, టీబీ నిర్మూలన పథకం, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన లబ్ధిదారుల కోసం దీన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇది మిగతా వారి కోసం కూడా ఉపయోగించనున్నారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రస్తుతానికి సోమవారం నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు సాయం అందనుంది.
ఇదీ చదవండి:కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందా? ఐటీఆర్ దాఖలు చేయండి!