ఎప్పటినుంచో పరారీలో ఉన్న రుణ ఎగవేతదారు విజయ్ మాల్యాను.. బ్రిటన్ అతిత్వరలో భారత్కు అప్పగించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నేరుగా ఆయనను ముంబయికి తరలించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆయన వెంట ఉండనున్నారు.
ముంబయి విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజే భారత్కు వస్తే ఆయనను రాత్రి ముంబయిలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలోనే ఉంచుతారు. ఆ తర్వాత కోర్టు ముందు ప్రవేశపెడతారు.
ఒకవేళ.. విజయ్ మాల్యా భారత్కు శుక్రవారం వస్తే.. నేరుగా కోర్టుకే తరలించనున్నారు. సీబీఐ, ఈడీ కస్టడీలోకి తీసుకోవాలని చూస్తున్నాయి.
మే 14నే కోర్టులో చుక్కెదురు..
మే 14న బ్రిటన్ హైకోర్టులో.. తనని భారత్కు అప్పగించకూడదన్న మాల్యా అప్పీలు వీగిపోయిన సమయంలోనే మాల్యాను భారత్కు తెచ్చే అంశమై మార్గం సుగమమైంది.
2018లో విచారణ సందర్భంగా.. కింగ్ఫిషర్ అధినేతను భారత్కు అప్పగిస్తే ఎక్కడ ఖైదు చేస్తారో వివరాలు సమర్పించాలని కోరింది యూకే కోర్టు. బదులుగా.. అత్యంత భద్రతతో కూడిన ముంబయి ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచుతామని భారత ప్రభుత్వం గతంలోనే లండన్ కోర్టుకు తెలిపింది. గది వీడియోను కోర్టుకు సమర్పించింది.
17 భారతీయ బ్యాంకులకు రూ. 9,000 కోట్ల రుణాలను ఎగవేశారు మాల్యా. ఈ మొత్తంతో 40 విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని అభియోగాలు ఉన్నాయి.