కరోనా మహమ్మారి విజృంభణ వేళ స్వాబ్‌ల కొరత రూపంలో ఎదురైన సవాలును భారత్ 10 రోజుల వ్యవధిలో అధిగమించింది. ‘భారత్‌లో తయారీ’లో భాగంగా ఉత్పత్తిని ప్రారంభించింది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఒక్కో స్వాబ్ పుల్ల ధర రూ.17 కాగా.. అందులో పదో వంతు రేటుకే ప్రస్తుతం మన దేశంలో అవి అందుబాటులోకి రావడం విశేషం.
లాభాపేక్ష లేకుండా..
కొవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరించేందుకు స్వాబ్‌లు అవసరం. వ్యాధి ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వాటికి డిమాండ్ బాగా పెరిగింది. అవసరాలకు సరిపడా స్వాబ్‌లను మన దేశం దిగుమతి చేసుకోలేని పరిస్థితి తలెత్తింది. దీంతో కేంద్ర జౌళి శాఖ.. జాన్సన్ అండ్ జాన్సన్, రిలయన్స్ ఇండస్ట్రీలను సంప్రదించింది. లాభాపేక్ష లేకుండా స్వాబ్‌ల ఉత్పత్తికి అవి ముందుకొచ్చాయి.
స్వయం సమృద్ధి..
స్వాబ్‌ల తయారీలో అవసరమైన పాలీఎస్టర్‌ను రిలయన్స్ సమకూర్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి ఇయర్‌బడ్‌లను తయారుచేసి అందించే ఆది ఎంటర్‌ప్రైజెస్‌కు ఆ ముడిపదార్థాన్ని అందజేసింది. ఆది ఎంటర్‌ప్రైజెస్ నమూనా స్వాబ్‌ను తయారుచేసి.. పరిశీలన కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ)కి పంపించింది. ఆపై ఎన్‌ఐవీ సూచనల మేరకు స్వాబ్ పుల్ల పొడవును పెంచింది. ఈ నెల 6 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగా స్వాబ్‌ల ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం రోజుకు లక్ష చొప్పున వాటిని తయారు చేస్తోంది. ఒక్కో స్వాబ్ ధర రూ.1.7 మాత్రమే. త్వరలోనే కొత్త యంత్రాలను దిగుమతి చేసుకుంటామని.. వాటితో ఉత్పత్తి రోజుకు 5-6 లక్షలకు పెరుగుతుందని ఆది ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. ఒక్కో స్వాబ్ ధర రూ.1కి తగ్గుతుందని కూడా పేర్కొంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే భారత కంపెనీలు స్వాబ్‌ల నమూనా రూపకల్పన నుంచి ఉత్పత్తి దశకు చేరుకోవడం విశేషం.
ఇదీ చూడండి: సాంకేతిక వృద్ధికి శరాఘాతం