భారత్‌లో పెద్ద నోట్లను రద్దు చేసి సోమవారం(నవంబరు8)తో ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలో ఆర్థిక సేవల అందుబాటు, బ్యాంకు ఖాతాల సంఖ్యపై భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ)(SBI Survey On Finance) ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ నేతృత్వంలోని బృందం రూపొందించిన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.
మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల పెరుగుదలతో ఆర్థిక సమ్మిళిత కొలమానాల్లో భారత్.. చైనాను అధిగమించినట్లు ఈ నివేదిక తెలిపింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- 2015లో దేశంలో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు ప్రతి వెయ్యి మందికి 183 ఉండగా, 2020లో ఆ సంఖ్య 13,615కు పెరిగింది.
- 2015లో ప్రతి లక్ష మంది జనాభాకు బ్యాంకు శాఖలు 13.6 శాతం ఉండగా, 2020లో ఆ సంఖ్య 14.7 శాతానికి పెరిగింది.
- చైనా, జర్మనీ, దక్షిణాఫ్రికా కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ
- ఆర్థిక సేవలు ఎక్కువ మందికి అందుబాటులోకి రావటం, బ్యాంకు ఖాతాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో మద్యం, పొగాకు వినియోగంతో పాటు నేరాలు కూడా తగ్గాయి.
- గత ఏడేళ్లలో నిర్ణీత మొత్తం కంటే తక్కువ నగదు ఉండడం లేదా అసలు నగదు లేకున్నా కొనసాగించే ఖాతాలు భారీగా పెరిగాయి.
- 2021 అక్టోబర్ 20 నాటికి ఈ- బ్యాంకు ఖాతాల సంఖ్య 43.7 కోట్లకు పెరిగి ఒక లక్షా 46వేల కోట్ల రూపాయల నగదు వాటిల్లో జమ అయింది.
- ఈ ఖాతాల్లో మూడింట రెండొంతులు గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ తరహా ఖాతాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 78 శాతం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 18.2 శాతం, ప్రైవేటు బ్యాంకుల్లో 3శాతం ఉన్నాయి.
- 2010 మార్చిలో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు 33,378 ఉండగా.. 2020 డిసెంబర్‌లో ఆ సంఖ్య 55,073కు చేరింది.
గత ఏడేళ్లలో భారత గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే కేంద్రాలు కూడా పెరిగాయని నివేదికలో వెల్లడైంది.
ఇదీ చూడండి: డేటా అయిపోయిందా? ఛార్జీలు లేకుండా లోన్ తీసుకోండిలా..