అనేక సమస్యలతో సతమతం అవుతున్న దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమోబైల్, వాటి విభాగాలు, డ్రోన్ల తయారీ రంగానికి రూ.26,058 కోట్లతో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
"ఆటోమొబైల్ రంగం, ఆటోమోబైల్‌విడిభాగాల తయారీ రంగం, డ్రోన్ తయారీ రంగాలు తమ తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం మొత్తం రూ.26,058 కోట్లు కేటాయింపు జరిపాం. ఈ పథకం వల్ల ఆధునిక వాహనాలు, వాటి విడి భాగాలు, డ్రోన్ల తయారీకి మద్దతు లభిస్తుంది. ఆయా రంగాల్లో విజయవంతమైన కంపెనీలు ఆవిర్భవించడానికి బాటలు కూడా పడతాయి. ఆయా రంగాల్లో రూ. 42,500 కోట్ల పెట్టుబడులు రాగలవని అంచనా. 7.5లక్షల మందికి ఉపాధి లభిస్తుంది."
-- అనురాగ్ ఠాగూర్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి
7.5లక్షల మందికి ఉపాధి..
ఈ ప్రోత్సాహకాలు ఆయా సంస్థలకు ఐదేళ్ల కాలంలో అందించనున్నట్లు తెలిపారు ఠాగూర్. ఈ రంగాల్లో రానున్న ఐదేళ్లలో రూ. 42,500 కోట్ల పెట్టుబడులు, దాదాపు 7.5లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఛాంపియన్ ఓఈఎం పథకం, కాంపోనెంట్ ఛాంపియన్ ఇన్సెంటీవ్ పథకం
బ్యాటరీ, ఎలక్ట్రిక్, హైడ్రోజన్ సంబంధిత వాహన తయారీ సంస్థలకు ఛాంపియన్ ఓఈఎం పథకం వర్తిస్తునట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహన తయారీ సంస్థలకు ఇది వర్తించదన్నట్లు సమాచారం. టూ వీలర్స్, త్రీ వీలర్స్, కార్లు, ట్రాక్టర్లు, వాణిజ్య వాహన తయారీ సంస్థలకు కాంపోనెంట్ ఛాంపియన్ ఇన్సెంటీవ్ పథకం వర్తిస్తోందని కేంద్రం తెలిపింది.
అధునాతన సాంకేతికతను జోడించి.. డ్రోన్లు, డ్రోన్ పరికరాల తయారీ కోసం ఈ పథకం ప్రోత్సాహకాలు అందించింది. మూడేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ.5వేల కోట్ల పెట్టుబడులు, 10వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు కేంద్రం వివరించింది.
టెలికాం రంగానికి ఊరట..
పలు రక్షణాత్మక నిబంధనలతో.. టెలికాం రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. టెలికాం కంపెనీల చట్టబద్ధమైన బకాయిల చెల్లింపుపై 4 ఏళ్లు మారటోరియం విధిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మారటోరియం వినియోగించుకునే కంపెనీలు వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. టెలికాం కంపెనీలు బకాయిలు చెల్లించేందుకు గడువును మరికొంతకాలంపాటు పెంచింది.
టెలికాం కంపెనీల సవరించిన స్ధూల ఆదాయం బకాయిలు.. ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్ధం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టెలికాం ఏతర ఆదాయాన్ని ఏజీఆర్ నుంచి తొలగించనున్నట్లు సంకేతాలిచ్చింది.
ఇదీ చదవండి: రక్షణ శాఖ నూతన భవనాలను ప్రారంభించనున్న ప్రధాని