దేశంలో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వస్త్ర వ్యాపారులు భారీగా డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాత సరకును క్లియర్ చేయడం సహా వినియోగదారులను ఆకర్షించేందుకు వ్యాపారులు ప్రయత్నించవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
లాక్డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్త్ర వ్యాపారం తీవ్రంగా ప్రభావితమైంది. దుకాణాలన్నీ మూతపడ్డాయి. ఫలితంగా వేసవి ప్రత్యేక దుస్తుల ఆర్డర్లను రద్దు చేశారు వ్యాపారులు. ఈ అమ్ముడుపోని పాత స్టాకును తక్కువ ధరలకు అమ్మే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
"లాక్డౌన్ తర్వాత ధరలు తగ్గించే విషయమై ప్రస్తుతం ఎలాంటి వ్యూహాలను రూపొందించలేదు. కానీ ఒక ఉత్పత్తిదారుడిగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాలి. వాళ్లను తిరిగి మా స్టోర్లకు రప్పించేందుకు ప్రయత్నాలు చేయాలి. సీజన్‌ను బట్టి ఆఫర్లను ప్రకటించాల్సి ఉంటుంది."
- సందీప్ చుగ్, బెనిటన్ ఇండియా ఎండీ
వేసవి సీజన్ మధ్యలో లాక్డౌన్ ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని.. ఆ సమయానికి తగినట్లు ఆఫర్లు ప్రకటించాల్సి ఉంటుందని సందీప్ అభిప్రాయపడ్డారు. అయితే మార్కెట్ వాతావరణంపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలిపారు. అది కూడా ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడే ఉంటుందని స్పష్టం చేశారు.
జీఎస్టీ నాటి పరిస్థితులు..
ధరల తగ్గింపు, డిస్కౌంట్లు ఇవ్వటమనేది లాక్డౌన్ కాలపరిమితిపై ఆధారపడి ఉంటుందని స్పైకర్ లైఫ్ స్టయిల్స్ సీఈఓ సంజయ్ వఖారియా అన్నారు. లాక్డౌన్ ఎత్తివేతలో ఆలస్యం జరిగితే వేసవి దుస్తులపై డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు.
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ల దుస్తులు చైనా, ఆగ్నేయాసియాలోనే తయారవుతాయి. చైనా ఇప్పుడిప్పుడే లాక్డౌన్ నుంచి బయటపడినా.. ఇతర దేశాల్లో మాత్రం కొనసాగుతోంది. పరిస్థితిని అంచనా వేసేందుకు మరింత సమయం వేచి చూడాలని రేమండ్ అధికార ప్రతినిధి చెప్పారు.
"మే నెలలో వినియోగదారుల ఆసక్తిని బట్టి కోల్పోయిన అమ్మకాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దేశంలో జీఎస్టీ అమలు చేసినప్పటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉంది. అందుకు తగినట్లు వ్యవహరించాలి."
-రేమండ్ అధికార ప్రతినిధి
వ్యాపారుల వ్యుహాలు..
ఈ సీజన్లలో సాధారణ మోడళ్లను తీసుకొస్తారని.. అరుదుగా వాడే దుస్తులపై దృష్టి సారిస్తారని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. చిన్న వ్యాపారుల మాత్రం నగదు లభ్యతతో ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపింది. ఫలితంగా ఏప్రిల్ లేదా మే నెలల్లో అధిక డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉందని చెబుతోంది.
రెండో భాగంలో డిమాండ్ రికవరీ ఆధారంగా కోసం కొత్త సీజన్ దుస్తులతో పెద్ద వ్యాపారులు లాభాలు పొందుతారని ఐఐఎఫ్ఎల్ తెలిపింది. ఇందుకోసం సరఫరా వ్యవస్థను కూడా సిద్ధం చేసినట్లు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: 'ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ కొనసాగింపు'