''రుణమాఫీ అసాధ్యమని చెప్పిన ప్రతిపక్ష నేత జగన్...ఇప్పుడేమో రైతులపై మొసలికన్నీరు కారుస్తున్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలి. సమాజానికే పెనుప్రమాదంగా జగన్ మారారు. వివేకా హత్యపై నాటకాల మీద నాటకాలు ఆడుతున్నారు. తెదేపా డేటా చోరీకి భారీ కుట్ర చేశారు. ఫారం-7 ద్వారా 9 లక్షల ఓట్ల తొలగింపును ఇంకో కుట్ర పన్నారు. జగన్ కుట్రలు, నాటకాలకు అంతేలేకుండా పోయిందిఅన్నారు చంద్రబాబు.
ప్రత్యేక హోదా విషయాన్ని వైకాపా అభ్యర్థులు.. బోరింగ్ సబ్జెక్ట్ అంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. వైకాపా ఎంపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే.. రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. మోదీ కోసమే వైకాపా ఎంపీలు రాజీనామాలు చేశారని ఆరోపించారు. ఎన్నిక రాకుండా చూసి రాజీడ్రామా ఆడారన్నారు. వైకాపా నేతలు ఆంధ్రప్రదేశ్‌పై గద్దల మాదిరిగా వాలుతున్నారనీ.. రాష్ట్రాన్ని మింగేసేందుకు వస్తున్న ఆ నేతలకు బుద్ధి చెప్పాలనీ పిలుపునిచ్చారు.
జగన్, కేసీఆర్, మోదీ కుట్రలు పేట్రేగిపోయాయి. తెదేపా అభ్యర్థులకు బెదిరింపులు, నాయకులకు ప్రలోభాలు, కార్యకర్తలకు వేధింపులు తప్పటం లేదు. ఆర్థికమూలాలు దెబ్బతీస్తున్నారు. ఆంధ్రా పోలీసులు, వైద్యులపై నమ్మకం లేదంటున్న జగన్‌కు ఆంధ్రా ఓట్లు ఎందుకు? చిన్నాన్న హత్యను రాజకీయం చేస్తూ తెదేపాపై నిందలు వేశారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్‌లు అంటూ.. తన మంత్రులను ఏపీపైకి పంపి రెచ్చగొడతున్నారు. జగన్‌కు మోదీ, కేసీఆర్ అండదండలు ఉన్నాయి. ఆ మూడు పార్టీల కుట్రలకు బుద్ధి చెప్పాలి. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చే తెదేపాకే మద్దతుగా నిలిచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి'' అని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు.