ఎంతకైనా దిగజారే గుణం
ఆధిక్యం కోసం దేనికైనా దిగజారే పార్టీ వైకాపా అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం ప్రతిపక్షం తప్పుడు పనులను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. నేరస్థుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయని.. నేరస్థులతో పోరాటంలో మరింత అప్రమత్తత కావాలని హెచ్చరించారు. రాజధానిలో రూ.లక్ష కోట్ల అవినీతి అని దుష్ప్రచారం చేశారని...దుష్ప్రచారాన్ని తాను ఖండించగానే వెనక్కితగ్గారని తెలిపారు. భూములు రైతుల వద్దే ఉంటే అవినీతికి చోటెక్కడ..? అని సీఎం ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టారని మండిపడ్డారు. నేరమయ రాజకీయాలకు చిరునామా జగన్ కుటుంబమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నేరమయ రాజకీయాలకు చిరునామా జగన్
నలుగురి కుట్రలు తిప్పికొట్టండి
మోదీ, షా, కేసీఆర్, జగన్ కుమ్మక్కై కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు. నలుగురి కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ నేతలకు సీఎం సూచించారు. ఓటమి భయంతోనే వైకాపా కుట్రల మీద కుట్రలు చేస్తుందని అన్నారు. ధైర్యంగా మనం ఎదుర్కొంటేనే ప్రజల్లో విశ్వాసం ఉంటుందని అన్నారు.
పట్టుదల పెరగాలి
తెదేపా నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నేతలు, కార్యకర్తల్లో పట్టుదల పెరగాలని సూచించారు. అన్నిచోట్లా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. పార్లమెంటు వారీగా సమీక్షలు చేస్తున్నాం... 4 ఎంపీ సీట్లలో ఎంపికలు పూర్తిచేశామని తెలిపారు. అన్ని అసెంబ్లీ స్థానాలకు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఏరియా కోఆర్డినేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందుబాటులో ఉంచుతున్నారు.
సమీక్షల సందర్భంగా వారితో స్వయంగా భేటీ కానున్నట్లు తెలిపారు. తెదేపా గెలుపులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరికీ జవాబుదారీతనం ఉండాలని...ప్రత్యర్థుల నేరచరిత్ర గుర్తుంచుకోవాలని సూచించారు. హత్యలు, దోపిడీలు, దాడులు ప్రత్యర్థుల సంస్కృతని అన్నారు.
ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కుట్రలు
ఈ ఎన్నికల్లో కొత్త తరం ఓటర్లే ఎక్కువని...ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు చేస్తున్నారని అన్నారు. కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని సీఎం తెలిపారు. వక్రీకరించే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని చంద్రబాబు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...