Fodder scam: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఈమేరకు తీర్పు చెప్పింది. ఫిబ్రవరి 18న ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో మరో 36 మందికి మూడేళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది సీబీఐ స్పెషల్ కోర్టు.
దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. దోరండా ఖజానా నుంచి రూ.139.35కోట్లు దుర్వినియోగం కేసు ఐదోది, చివరిది. ఈ కేసులో మొత్తం 170 మంది నిందితులు కాగా.. 55 మంది మరణించారు. ఏడుగురు ప్రభుత్వం తరఫున సాక్షులుగా మారారు. ఇద్దరు నేరం అంగీకరించారు. ఆరుగురు పరారీలో ఉన్నారు. చివరకు లాలూ సహా మొత్తం 99 మంది నిందితులపై ఫిబ్రవరి నుంచి విచారణ జరిపిన రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఈ జనవరి 29న తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. మంగళవారం లాలూను దోషిగా తేల్చింది.
950 కోట్ల కుంభకోణం..
అవిభాజ్య బిహార్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.950కోట్ల దాణా కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. 1996 జనవరిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లాలూను నిందితునిగా పేర్కొంటూ 1997 జూన్‌లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత సుదీర్ఘ విచారణ జరిగింది. లాలూతోపాటు బిహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాపైనా సీబీఐ అభియోగాలు మోపింది.
దుమ్కా, దేవ్ఘడ్, ఛాయ్బసా ఖజానాల నుంచి నిధుల దుర్వినియోగానికి సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. ఆయనకు మొత్తం 14 ఏళ్లు శిక్ష, రూ.60లక్షల జరిమానా పడింది.
2013 సెప్టెంబర్‌లో దోషిగా తేలి, తొలిసారి రాంచీ జైలుకు వెళ్లారు లాలూ. 2013 డిసెంబర్లో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది బయటకు వచ్చారు. అయితే.. 2017 డిసెంబర్లో మరో కేసులో దోషిగా తేలగా.. లాలూ బిర్సా ముండా జైలుకు వెళ్లారు. 2021 ఏప్రిల్‌లో ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఇవీ చూడండి: వయసు 60+.. 14 మందికి భర్త.. 7 రాష్ట్రాలకు అల్లుడు.. చివరకు..