YSRCP Govt Spread lies on Siemens Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. సీమెన్స్ ప్రాజెక్ట్ విషయంలో అసత్య ప్రచారాలు చేస్తూ.. అందర్నీ నమ్మించే ప్రయత్నాలు చేస్తోంది. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్తూ.. దుష్ప్రచారానికి తేరలేపింది. సీమెన్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిజాలు కళ్ల ముందే కనిపిస్తున్నా.. అబద్ధాలతో అక్కసు వెళ్లగక్కుతోంది. సీమెన్స్ సంస్థల్లో యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్, శిక్షణ తీసుకున్న అభ్యర్థులు లేరంటూ విష ప్రచారం చేస్తోంది. మరి, ఏపీలో ఎన్ని సీమెన్స్ కేంద్రాలు ఉన్నాయి..?, ఆ కేంద్రాల్లో ఏయే పరికరాలు ఉన్నాయి..?, ఆ కేంద్రాల్లో ఎంతమంది అభ్యర్థులు శిక్షణ తీసుకున్నారు..?, శిక్షణ తీసుకున్నవారు ఏయే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు..?, అసలు సీమెన్స్ ప్రాజెక్ట్ వాస్తవాలు ఏమిటి..? అనే వివరాలను ఈటీవీ-ఈనాడు-ఈటీవీ భారత్ ప్రతినిధులు కేత్రస్థాయిలో పరిశీలించి.. కీలక విషయాలను వెల్లడించారు.
Total Six Center of Excellences Inauguration: యువతకు ఉద్యోగ భరోసా కల్పించాలనే లక్ష్యంతో.. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు, 34 సాంకేతిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, ఆ కేంద్రాల్లో సీమెన్స్ యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్వేర్లు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 2.13లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొంది.. 75వేల మందికి ఉద్యోగాలు లభించాయి. కానీ, జగన్ ప్రభుత్వం వాస్తవాలను పట్టించుకోకుండా నిధుల మళ్లింపు పాటే పాడుతోంది. తాను చెప్పిన అబద్ధాలు బయటపడతాయనే ఉద్దేశంతో చివరికి అనేక శిక్షణ కేంద్రాలను సైతం మూయించేసింది. యువతకు నైపుణ్య శిక్షణను నిలిపివేసింది. అన్నింటిలోనూ యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్, హార్డ్వేర్లు ఉన్నప్పటికీ.. నిధుల మళ్లింపు అని బుకాయిస్తోంది. ఒకవేళ నిధులు మళ్లిస్తే.. ఈ పరికరాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి..? అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతుంది.
Siemens Project at Idupulapaya: వైఎస్ కుటుంబానికి పులివెందుల తర్వాత ముఖ్యమైన ప్రాంతం ఇడుపులపాయ. సీఎం జగన్ కుటుంబం ఎంతో ప్రాధాన్యం ఇచ్చే ఇడుపులపాయలోనూ అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్న ట్రిపుల్ ఐటీలోనూ చంద్రబాబు సీమెన్స్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులకు ఆటోమోటివ్ టూ వీలర్, ఫోర్ వీలర్ ల్యాబ్‌లు, కంప్యూటర్ బేస్డ్ ల్యాబ్, ఎలక్ట్రానిక్ హోంల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, ఎలక్ట్రికల్ హోం ల్యాబ్, ఏసీ యంత్రాలపై విద్యార్థులకు శిక్షణ అందించారు. దీని ద్వారా 10వేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించారు.
10 Thousand people have Been Trained in Siemens: ఈ నేపథ్యంలో నిధులు ఖర్చు చేసి యంత్రాలు, పరికరాలు ఏర్పాటు చేయకపోతే, ఇక్కడ ఇంత మందికి శిక్షణ ఎలా సాధ్యమైంది..?. వేంపల్లె, ప్రొద్దుటూరు, పులివెందుల లయోలా పాలిటెక్నిక్ కళాశాల, వేముల, చక్రాయపేట ప్రభుత్వ ఐటీఐ, పులివెందుల జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలల్లో 10వేల మంది శిక్షణ పొందారు. విద్యార్థులకు భోజన సదుపాయం సైతం కల్పించారు. డిజైన్ టెక్ సంస్థ రెండేళ్లపాటు ఇచ్చే శిక్షణ గడువు ముగియడంతో ఆటోమోటివ్ టూవీలర్, ఫోర్‌వీలర్ ల్యాబ్‌లను చక్రాయపేట ప్రభుత్వ ఐటీఐ, పులివెందుల న్యాక్ కేంద్రానికి, ఎలక్ట్రానిక్స్ హోంల్యాబ్‌ను వేముల ప్రభుత్వ ఐటీఐకి, ఎలక్ట్రానిక్ హోంల్యాబ్‌ను కడప డీఎల్‌టీసీకి, ఆర్ అండ్ ఏసీ ల్యాబ్‌ను తిరుపతి జిల్లా శ్రీసిటీకి తరలించారు. ట్రిపుల్ ఐటీలో 84 కంప్యూటర్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.
Two centers in Annamaiya District: ఇక, అన్నమయ్య జిల్లాలో అన్నమాచార్య, మదనపల్లి ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్నమాచార్య కళాశాలలో ఏర్పాటు చేసిన నైపుణ్య కేంద్రంలో 3 వేల 676మంది శిక్షణ పొందగా.. వీరిలో 700మంది ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం 12మంది శిక్షణ పొందుతున్నారు. మదనపల్లి ఇంజినీరింగ్ కళాశాలలోనూ శిక్షణలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్, అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో సుమారు 2వేల మంది శిక్షణ పొందితే, 60 శాతానికి పైగా విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగాలకూ సీమెన్స్‌లో శిక్షణ ఇచ్చారు. అనంతపురంలో ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
Siemens centers in the Combined Kurnool District: ఉమ్మడి కర్నూలు జిల్లాలో జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్, నంద్యాలలోని రాజీవ్‌గాంధీ మెమోరియల్ కళాశాల, శ్రీశైలంలోని ప్రభుత్వం ఆదర్శ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలల్లో సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్‌తో 2017లో సీమెన్స్ సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 5 వేల 550 మంది విద్యార్థులు శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణ పొందిన వారిలో 60శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు.
Students Fire on YCP Government: ఈ క్రమంలో నిధులు దారి మళ్లితే ఇక్కడ ఈ యంత్రాలు ఎలా వచ్చాయి..? శిక్షణ ఎలా పొందారు..? శిక్షణ కేంద్రంలో మొదట్లో 8మంది శిక్షకులను ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పట్టించుకోకపోవడంతో.. ఒక్కరు మాత్రమే మిగిలారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఐటీఐ విద్యార్థులను ఈ శిక్షణ కేంద్రానికి పంపించేవారు. సీబీటీ, ఎలక్ట్రానిక్స్ ఆఫీస్, ఎలక్ట్రానిక్స్ హోమ్, సీఎన్‌సీ, వెల్డింగ్‌లో మూడు నెలలపాటు శిక్షణ ఇస్తారు. పుల్లారెడ్డి కళాశాలలో శిక్షణలు కొనసాగుతుండగా.. రాజీవ్‌గాంధీ మెమోరియల్ కళాశాల, శ్రీశైలం పాలిటెక్నిక్‌ల్లో శిక్షణ ఆగిపోయింది. కర్నూలులో సీమెన్స్ సాంకేతిక నైపుణ్య కేంద్రంలో మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకొని, సర్టిఫికెట్లను చూపుతున్న ఈ విద్యార్థులు పాలిటెక్నిక్ వారు. యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్ లేకపోతే ఈ విద్యార్థులు నైపుణ్య శిక్షణ ఎలా పొందారు..? ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు ఎలా వచ్చాయి..? ఈ శిక్షణ, సర్టిఫికెట్ తమకు ఉద్యోగాలు వచ్చేందుకు ఉపయోగపడ్డాయని విద్యార్థులు చెబుతున్నారంటే దీనికి ఎంత ప్రాధాన్యం ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
Siemens Technical Center in Visakhapatnam: విశాఖలోని గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలలో సీమెన్స్ టెక్నికల్ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కంప్యూటర్ న్యుమరికల్ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ వెల్డింగ్ ల్యాబ్, కంప్యూటర్ బేస్డ్ ట్రైనింగ్, ఎలక్ట్రానిక్ ఆఫీస్, ఎలక్ట్రానిక్ హోమ్స్, అగ్రికల్చర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. వీటిలో డిప్లొమా విద్యార్థులకు ఆరు నెలలు, బీటెక్ విద్యార్థులకు ఒక నెల శిక్షణ ఇస్తున్నారు. గాయత్రి కళాశాలతోపాటు పరిసరాల్లోని ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు 9,023 మంది నమోదు చేసుకోగా 8,023 మంది శిక్షణ పూర్తి చేసుకొని ధ్రువపత్రాలు పొందారు.
Siemens Centers Closed During YCP Regime: ఒక్క టీడీపీ హయాంలోనే 4వేల మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందగా.. 70శాతం మందికి ఉద్యోగాలు లభించాయి. విద్యార్థులు ప్రయోగాలు చేస్తున్న ఈ యంత్రాన్ని సీమెన్స్ ప్రాజెక్టులో భాగంగా అందించిందే. ఇంజినీరింగ్ విద్యార్థులు ఏదైన డిజైను సాఫ్ట్‌వేర్‌లో రూపొందించి, ఈ యంత్రానికి అనుసంధానిస్తే కావాల్సిన డిజైన్‌ను అందిస్తుంది. దీని ఖరీదు రూ.60లక్షలకుపైనే ఉంటుంది. నిధులు ఖర్చు చేయకపోతే ఇలాంటి యంత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి..? కంప్యూటర్లపై నైపుణ్యాలు నేర్చుకుంటున్న ఈ విద్యార్థులంతా పని చేస్తున్నది సీమెన్స్ సాఫ్ట్‌వేర్‌పైనే. క్షేత్రస్థాయిలో విద్యార్థులు సీమెన్స్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకొని, నైపుణ్యాలు పొందుతుంటే ప్రభుత్వం మాత్రం అదంతా ఊహజనితమే అంటోంది. వందల కోట్ల విలువైన యంత్రం పని చేయాలన్నా సాఫ్ట్‌వేరే ప్రధానం. పెద్దపెద్ద యంత్రాల్లా సాఫ్ట్‌వేర్ కంటికి కనిపించదు కదా..! ఇండో జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 80 కంప్యూటర్లు, యంత్రాలు, పరికరాలు ఉన్నాయి. కరోనా సమయంలో ఈ కేంద్రాన్ని మూసివేశారు. ఇప్పటి వరకు తెరవలేదు.
Siemens Centers in Joint East Godavari Districts: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సూరంపాలెంలోని ప్రగతి, ఆదిత్య, గోదావరి ఇంజినీరింగ్ కళాశాలల్లో సీమెన్స్ సాంకేతిక నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిత్య కళాశాలలో 3.50 కోట్ల రూపాయలతో 2016లో ఏడు ల్యాబ్‌లు పెట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ 12 వేల మంది విద్యార్థులు శిక్షణ పొందారు. 2019 వరకు 4వేల మంది నైపుణ్య శిక్షణ పొందగా 80 శాతం మందికి ఉద్యోగాలు వచ్చేందుకు ఈ శిక్షణ ఉపయోగపడింది. రాజానగరం గోదావరి ఇంజినీరింగ్ కళాశాలలో అయిదు ల్యాబ్‌లను 2018లో ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం 60 కంప్యూటర్లు పెట్టారు. ఇప్పటి వరకు ఈ ఒక్క కేంద్రంలోనే 6 వేల మంది శిక్షణ పొందారు. 2019 వరకు శిక్షణ పొందిన అభ్యర్థులకు రవాణా, ఇతరత్రా ఖర్చులకు 500 చొప్పున ప్రభుత్వమే చెల్లించింది.
Training for 13 Thousand candidates at Sricity Centre: తిరుపతి జిల్లాలో ఆదిశంకర, శ్రీవిద్యానికేతన్, శ్రీవేంకటేశ్వర పాలిటెక్నిక్, పుత్తూరులోని సిద్ధార్థ ఇంజినీరింగ్, సత్యవేడులోని శ్రీసిటీ సెజ్‌లో నైపుణ్య కేంద్రాలను తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శ్రీసిటీలోని కేంద్రంలో గతేడాది డిసెంబరు వరకు 3 వేల 300 మందికి కంప్యూటర్స్, బైకు, కార్ల మెకానికల్, వెల్డింగ్, సీఎన్‌సీ వంటి వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చారు. వీరిలో 2 వేల మంది వరకు శ్రీసిటీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రోత్సాహకం లేకపోవడంతో గత 9 నెలలుగా శిక్షణలు ఇవ్వడం లేదు. గూడూరులోని ఆదిశంకరా ఇంజినీరింగ్ కళాశాలలో వెల్డర్ ల్యాబ్, టూ వీలర్, ఫోర్ వీలర్ ల్యాబ్‌లు, ఆగ్రో ల్యాబ్, కంప్యూటర్ బేస్డ్ ట్రైనింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. సుమారు 4 కోట్ల రూపాయల విలువైన ఆధునిక యంత్రాలు, ఇతర పరికరాలను సమకూర్చారు. 13వేల మందికి శిక్షణ ఇచ్చారు.
Training for 5,660 People at Puttur Siemens Centre: ఒక్క టీడీపీ హయాంలోనే 5వేల మంది శిక్షణ పొందారు. పుత్తూరు సమీపంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సీమెన్స్ కేంద్రంలో ఇప్పటి వరకు 5 వేల 660 మందికి శిక్షణ ఇచ్చారు. కరోనా తర్వాత ఇక్కడ శిక్షణ నిలిచిపోయింది. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పూర్తిగా మూలకు పడింది. శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2017లో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ హోమ్ ఎలక్ట్రికల్స్‌పై 90గంటల శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు 768 మంది శిక్షణ పొందారు. రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్ అండ్ ఏసీ సర్వీసింగ్‌పై 120 గంటల శిక్షణను 101 మంది, కంప్యూటర్ బేసిక్ ట్రైనింగ్‌పై 45 గంటల శిక్షణను 840 మంది పూర్తి చేశారు. ఇక్కడ సుమారు 17 వందల మంది శిక్షణ తీసుకున్నారు. కొందరు స్వయంగా ఉపాధి పొందగా.. మిగతా వారు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు.
Siemens Centers in Joint West Godavari Districts: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో డీఎన్‌ఆర్, సర్ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల్లో సీమెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2017 నుంచి 2019 వరకు శిక్షణ కేంద్రాలు విద్యార్థులతో కళకళలాడాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపుతో వీటిని మూలకు పెట్టింది. వీటిల్లోని యంత్రాలు నిరుపయోగంగా మారాయి. వీటిల్లో 600 మంది వరకు శిక్షణ పొందగా.. 400మందికి ఉద్యోగాలు లభించాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్, ఆదిత్య, జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలల్లో మూడు సీమెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో 3వేలకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఐడీ దర్యాప్తు పేరుతో కొన్ని నెలలు మూసివేశారు. ఇప్పుడు ఆయా కళాశాలల విద్యార్థులకు మాత్రమే వీటిల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు.
Siemens Centers in Nellore District: నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజినీరింగ్, నెల్లూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సీమెన్స్ టెక్నికల్ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. కందుకూరు కేంద్రంలో 4,130 మంది శిక్షణ పొందారు. సీఐడీ కేసులతో ఈ కేంద్రాన్ని మూసివేశారు. పాలిటెక్నిక్‌లో నైపుణ్యం కేంద్రం పెన్నా నదికి వచ్చిన వరదల్లో మునిగిపోవడంతో యంత్రాలు పాడయ్యాయి. దీన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నైపుణ్య శిక్షణ నిలిచిపోయింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మహారాజా కళాశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరోనా తర్వాత నుంచి ఈ కేంద్రంలో శిక్షణలు నిలిపివేశారు. ప్రభుత్వం కేసులతో హడావుడి చేయడంతో గది తాళాలూ తెరవడం లేదు.
సీమెన్స్ ప్రాజెక్టు ఏమీ లేదని ప్రభుత్వమే ఆరోపణలు చేస్తున్నందున ఇప్పటికే ఈ శిక్షణతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల పరిస్థితి ఏంటి..? ఆ ధ్రువపత్రాలు చెల్లవని ఆయా కంపెనీలు అంటే 75 వేల మంది రోడ్డుపై పడాల్సిందే కదా..?.