కర్ణాటక హాసన్‌లో ఓ యువకుడు ఐఫోన్ కోసం కొరియర్ బాయ్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి నాలుగు రోజులపాటు బాత్ రూమ్‌లో ఉంచాడు. అనంతరం డెడ్‌బాడీని రైల్వే ట్రాక్‌పై పడేసి, కాల్చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం..
అరసీకెరె తాలూకా శివార్లలోని కొప్పలు రైల్వే గేట్ సమీపంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ఓ పెట్రోలు బంకులోని సీసీటీవీలో కెమెరాల్లో ఓ వ్యక్తి బైక్‌పై బ్యాగును తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో పోలీసులు ఈ విషయంపై విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది.
అరసీకెరె హలే కల్లనాయకన్ హళ్లి గ్రామానికి చెందిన నిందితుడు హేమంత్ దత్తా(20) అనే యువకుడు ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ను ఆర్డర్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 7న ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు హేమంత్ నాయక్(23) అనే వ్యక్తి హేమంత్ దత్తా ఇంటికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో నా దగ్గర అంత డబ్బు లేదని హేమంత్ దత్తా అన్నాడు. డబ్బులు ఇవ్వకముందే ఐఫోన్ బాక్స్‌ను తెరిచి చూపించాలని హేమంత్ దత్తా డెలివరీ బాయ్ హేమంత్ నాయక్‌ను కోరాడు. డబ్బులు చెల్లించకుండా బాక్స్‌ను తెరవనని డెలివరీ బాయ్ ఖరాఖండిగా చెప్పాడు.
కోపోద్రిక్తుడైన నిందితుడు హేమంత్ దత్తా.. నా స్నేహితుడు డబ్బులు తెస్తున్నాడు కాసేపు ఆగమన్నాడు. డెలివరీ బాయ్‌ను ఇంట్లోకి పిలిచి కూర్చోమని చెప్పాడు. ఇంట్లో కూర్చున్న డెలివరీ బాయ్‌ను వెనుక నుంచి వచ్చి నిందితుడు హేమంత్ దత్తా కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. తర్వాత డెలివరీ బాయ్ మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి నాలుగు రోజుల పాటు బాత్రూమ్లోనే ఉంచాడు. అనంతరం మృతదేహాన్ని నిందితుడు ఫిబ్రవరి 11వ తేదీ రాత్రి బైక్‌పై తీసుకెళ్లి అంచేకొప్పలు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై దహనం చేశాడు.
నిందితుడు హేమంత్ అరసీకెరె నగరం సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకుని వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి హేమంత్ నాయక్ కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఫుటేజీతో పాటు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.