Yediyurappa retirement: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా దిగ్గజ నేత యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాలకు ముగింపు పలుకనున్నారు. తన కుమారుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర కోసం శికరైపుర అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. 2023 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తన కుమారుడు పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇకపై తాను నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తానని.. తన కుమారుడు సైతం వారానికి ఒకసారి వస్తారని యడియూరప్ప తెలిపారు. పార్టీ పటిష్ఠం కోసం మరింత కృషి చేస్తానని చెప్పారు. 75 ఏళ్లకు మించిన వారికి పదవుల నుంచి తొలగించాలనే నిబంధన తీసుకరావడం వల్ల.. జులై 26, 2021న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
"శికరైపుర నుంచి నేను పోటీ చేయడం లేదు. ఈ స్థానం నుంచి విజయేంద్ర పోటీ చేస్తున్నారు. నా కుమారుడిని నాకన్నా భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గంలోని ప్రజలను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఓల్డ్ మైసూరు నుంచి పోటీ చేయాలని అభిమానులు డిమాండ్ చేశారు. కానీ నేను పోటీ నుంచి తప్పుకుని విజయేంద్రకు నా స్థానాన్ని కేటాయించాను."
-యడియూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి
'యడియూరప్ప మాకు తండ్రి లాంటివారు'
భాజపా సీనియర్ నేత యడియూరప్ప చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై స్పందించారు. ఆయన ఎప్పుడు రిటైర్ కారని.. ఆయన సారథ్యంలోనే 2023 ఎన్నికలకు వెళతామని ప్రకటించారు. యడియూరప్ప తమకు తండ్రి లాంటి వారని.. ఈ విషయం అధిష్ఠానానికి సైతం తెలుసన్నారు. కర్ణాటక సాధారణ అసెంబ్లీ ఎన్నికలు 2023 మే లో జరగనున్నాయి.
అంతకుముందు ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని యడియూరప్ప కోరారు. కానీ ఆయన వినతిని అధిష్ఠానం పక్కకుపెట్టింది. 2018లో వరుణ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. 2020 జులైలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో అనేక ఉపఎన్నికల్లో పార్టీ విజయాలు సాధించింది.
ఇవీ చదవండి: నీరవ్ మోదీకి షాకిచ్చిన ఈడీ! రూ.253.62 కోట్ల విలువైన ఆస్తులు జప్తు