Women Huge Rally In Guntur Against Chandrababu Arrest : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు (Naidu Arrest) నిరసనగా గుంటూరులో తెలుగు మహిళలు కదం తొక్కారు. యువత, మహిళలు, వృద్ధులు వేలాది తరలివచ్చి.. బాబుకు సంఘీభావంగా భారీ ర్యాలీ నిర్వహించారు. బారికేడ్లు, వాహనాలు అడ్డుపెట్టి నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, ఉక్కు సంకల్పంతో ముందుకు సాగారు. మేము సైతం బాబు కోసమంటూ గళమెత్తి, వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
Women Protest For Chandrababu : గుంటూరు నడిబొడ్డున తెలుగు మహిళలు ఉద్యమ స్ఫూర్తిని చాటారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమంటూ దిక్కులు మార్మోగేలా నిరసన గళం విప్పారు. యావత్తు తెలుగు ప్రజానీకంలో చైతన్యం కలిగేలా.. గుంటూరు నగర వీధుల్లో వేలాదితో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 ఏళ్ల వృద్ధులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారు. నవభారత్ నగర్‌లోని శుభం కల్యాణ మండపం నుంచి నల్ల వస్త్రాలు ధరించి, నల్ల బెలూన్లతో ప్రదర్శనలో పాల్గొన్నారు. లాడ్జీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు.
దార్శనికుడైన చంద్రబాబు సీఎంగా ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే కాకుండా ఐటీని అభివృద్ధి చేశారని మహిళలు అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ను కూడా ప్రపంచ పటంలో పెట్టేందుకు కృషి చేసిన దిగ్గజ నేతను స్కిల్ డెవలప్మెంట్ అనే దొంగ స్కాం చెప్పి.. జైలు పెట్టడంలో దారుణమని మహిళలు గర్జించారు. లక్షలాది కోట్లు దోచుకుని, అనేక కేసులున్న జగన్ సీఎం కావడమే...రాష్ట్రానికి పట్టిన దరిద్రమని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ పథకం ద్వారా వేలాదికి ఉద్యోగాలు వచ్చినా.. పాలన చేతకాని వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేయడంపై తెలుగు మహిళలు ధ్వజమెత్తారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేకుండా నిజాయితీకి మారుపేరుగా నిలిచిన చంద్రబాబు అరెస్ట్‌ను యావత్తు దేశం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తోందని తెలుగు మహిళలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో, విదేశాల్లోనూ చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారన్నారు.
ఒక వైపు ఎండ మండిపోతున్నా, ఎప్పుడూ అందోళనలకు బయటకు రాని గృహిణులు, మహిళలు ఒక్కసారిగా వేలమంది రోడ్డు పైకి వచ్చి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వృద్ధులు సైతం టోపీలు ధరించి ర్యాలీలో అడుగు ముందుకు వేశారు. ఎవరూ పిలుపు ఇవ్వకపోయినా , ఎవరూ నాయకత్వం వహించకపోయినా.. స్వతహాగా నిరసనలో పాల్గొన్నారు. తమ వాట్సప్ గ్రూపుల్లో సమాచారం పంచుకుని మహిళలు ర్యాలీలో పాల్గోన్నారు.
వేలాది తెలుగు మహిళలతో కూడిన నిరసన ర్యాలీ కొరిటెపాడు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రాగానే పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రహదారికి అడ్డుగా బారికేడ్లు, వాహనాలు పెట్టి నిరసన ర్యాలీని ఆపేందుకు యత్నించారు. చంద్రబాబుకు మద్దతుగా నిరసన ర్యాలీ నిర్వహిస్తుంటే అడ్డుకోవడం సరి కాదని తెలుగు మహిళలు పోలీసుల్ని ప్రశ్నించారు. ఎలాంటి ఆందోళనలు చేయకుండా శాంతియుతంగా లాడ్జీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి తీరుతామని చెప్పడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల ఆంక్షల్ని సైతం లెక్కచేయక.. తెలుగు మహిళలు చెదరని సంకల్పంతో ముందుకు సాగారు.