మహారాష్ట్ర ముంబయిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. మూడు నెలల క్రితం జరిగిన ఈ హత్యకేసును పోలీసులు తాజాగా ఛేదించారు. నిందితులు కవిత, ఆమె ప్రియుడు హితేశ్ జైన్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు కమల్‌కాంత్ షా (45) శాంతాక్రూజ్ వెస్ట్‌లో నివసించేవాడు. అతడికి కవిత అనే మహిళతో 2002లో వివాహం జరిగింది. వీరికి 20 ఏళ్ల కుమార్తె, 17 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కమల్‌కాంత్ స్నేహితుడు హితేశ్‌తో కవిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.
ఈ ఏడాది జూన్‌లో కమల్‌కాంత్ తల్లి మరణించింది. అనంతరం కమల్‌కాంత్‌ను హత్య చేసి అతడి ఆస్తి మొత్తాన్ని కాజేసేందుకు కవిత, ఆమె ప్రియుడు హితేశ్ ప్లాన్ వేశారు. కమల్‌కాంత్ తినే ఆహారంలో ఆర్సెనిక్ కలపడం ప్రారంభించారు. అది కాస్త స్లో పాయిజన్‌గా మారింది. అలా కొంతకాలానికి కమల్‌కాంత్ ఆరోగ్యం క్షీణించింది. కడుపునొప్పితో బాధపడిన కమల్‌కాంత్‌ను ఆగస్టు 27న అంధేరీలోని క్రిటికేర్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. మెరుగైన వైద్యం కోసం ముంబయిలోని ఓ ఆస్పత్రికి సెప్టెంబరు 3న తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కమల్‌కాంత్ సెప్టెంబరు 19న మరణించాడు. అతడి శరీరంలో ఆర్సెనిక్, థాలియం ఉన్నట్లు వైద్య నివేదికలో తేలింది. ఈ నివేదిక ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు.
కన్న కూతురిపై అత్యాచారం..
పంజాబ్ లుధియానాలో దారుణం జరిగింది. కన్న కూతురిపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఓ తండ్రి. బాధితురాలి ఇరుగుపొరుగువారు ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితుడు ముకేశ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. 11 ఏళ్ల బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.