Himachal Pradesh Election 2022 : మరో వారం రోజుల్లో పోలింగ్‌కు (ఈ నెల 12న) వెళుతున్న శీతల రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. 68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీపై ఆధిపత్యం కోసం అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. చాలా సీట్లలో ఓటర్ల సంఖ్య 90 వేల లోపే. కొన్నింటిలోనైతే 30 వేల లోపే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వందల ఓట్ల తేడాతో కూడా ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి. గణాంకాలు చూస్తే అధికార భాజపాకు మొగ్గున్నట్లు అనిపిస్తుంది. 15 సంవత్సరాలలో రాష్ట్రంలో భాజపా బలపడుతూ వస్తోంది. గత ఆరు ఎన్నికల్లో (అసెంబ్లీ, లోక్‌సభ కలిపి) ఓటింగ్‌ను చూస్తే.. 2012 తప్పిస్తే ప్రతిసారీ కాంగ్రెస్ కంటే భాజపా పైచేయిలో నిల్చింది.
ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లోనైతే హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు కమలదళం పక్షాన నిలబడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆదరణా ఎక్కువే. ఆ ఆదరణే ఓట్లుగా మారి ఈసారీ గెలిపిస్తుందనేది భాజపా ఆశ. కానీ.. లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఓటేస్తున్న ఓటర్లు.. అసెంబ్లీకి వచ్చేసరికి వేస్తారా అనేది ప్రశ్నార్థకం. స్థానిక నాయకత్వం, రాష్ట్రంలోని పరిస్థితులు, సమస్యలు ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ భాజపాకు ప్రతికూలంగా పనిచేసేవే. అందుకే డబుల్ ఇంజిన్ నినాదాన్ని ఆ పార్టీ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌కు మంచి పేరే ఉన్నా.. సమర్థత విషయంలో మార్కులు పెద్దగా పడటం లేదు. రాష్ట్రంపై కాకుండా తన సొంత నియోజకవర్గం సెరాజ్‌పైనే దృష్టిసారించారనే అపవాదు మూటకట్టుకున్నారు.
మొత్తానికి ఐదేళ్లకోసారి అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త సర్కారుకు అవకాశం ఇవ్వటం ఇక్కడి సమకాలీన ఎన్నికల చరిత్రగా మారింది. ఈసారి కూడా కచ్చితంగా అదే జరిగి.. తమకు అధికారం దక్కుతుందనేది విపక్ష కాంగ్రెస్ ఆశ! మరోవైపు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా మార్పుపై నమ్మకంతోనే ఉంది. కానీ.. వారు నమ్ముతున్నది ప్రభుత్వ మార్పు కాదు. హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు సర్కారును మార్చే ఆనవాయితీకి ఈసారి స్వస్తి చెప్పి కొత్త ఒరవడి సృష్టిస్తారని కమలనాథులు ఆశిస్తున్నారు. ఆ దిశగానే భాజపా ప్రచారం సాగిస్తోంది. ప్రజల్లో కొత్త రకం మార్పుపై ఆలోచన రేకెత్తిస్తోంది.
భాజపాను ఇబ్బంది పెడుతున్న అంశాలు
- పాత పింఛను విధానం అమలు చేయకపోవటంతో ఉద్యోగుల్లో నిరాశ
- కొవిడ్‌తో పర్యాటకం దెబ్బతినటం. నిరుద్యోగం పెరగటం
- ధరల పెరుగుదల
- రోడ్లు తదితర మౌలిక సదుపాయాల లేమి
- జాతీయ రహదారుల నిర్మాణంలో నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవటం
కాంగ్రెస్ నాయకత్వం ఒంటరి పోరు
మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భాజపాపై వ్యతిరేకత, 'మార్పు' చరిత్రను నమ్ముకొని ఈ ఎన్నికల్లో పోరాడుతోంది. మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ మరణంతో ప్రధాన నేత అంటూ ఎవరూ లేరు. పార్టీ అధిష్ఠానం కూడా రాహుల్ యాత్రలో మునిగితేలుతోంది. ప్రియాంక వాద్రా ప్రచారానికి వచ్చినా పెద్దగా ప్రభావం చూపుతారనే ఆశలు కార్యకర్తల్లో లేవు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వమే ఒంటరి పోరు చేస్తోంది.
ఇవీ చదవండి : నిరసన చేస్తుండగా కాల్పులు.. పంజాబ్ శివసేన నేత దారుణ హత్య
గుజరాత్ త్రిముఖ సమరం.. విజేతలను తేల్చే అంశాలివే.. ఓటరు తీర్పు ఎటువైపో?