బంగాల్లో ఓ వ్యక్తి కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. చలపాయ్గుడీ గ్రామంలో ఓ చెట్టుకింద నిర్వహిస్తున్న చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను రూపుమాపేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆ గ్రామంలో ఓ చెట్టు కిందకు జూదం, మద్యపానం చేసేందుకు చాలా మంది వస్తుంటారు. దీనివల్ల వాతావరణం కలుషితం అవ్వటమేకాక, వారి ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇదంతా గమనించిన సమరిటన్ నిమేష్ లామా అనే వ్యక్తి ఆ చెట్టుకింద జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను నివారించాలనుకున్నారు. దీనిలో భాగంగా అక్కడ ట్రీ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ ట్రీ లైబ్రరీని ఏర్పాటు చేసిన తరువాత ఆ ప్రాంతం జూదం, మద్యపానంలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంది.
"నేను ఈ యూరోపియన్ ఫీల్డ్‌కు సరదాగా గడిపేందుకు వచ్చేవాడిని. అయితే ఆ సమయంలో ఈ చెట్టు చుట్టూ చాలా మంది కూర్చుని జూదం ఆడటం, మద్యపానం చేయటం నేను చూశాను. చట్ట విరుద్ధ కార్యక్రమాలకోసం వీరంతా కలిసి చెట్టు చుట్టూ చేరారు. వీటిని నివారించేందుకు నా స్నేహితులతో నేను ఎందుకు కలిసి వెళ్లకూడదని అనిపించింది. అందుకే నేను నా ఫ్రెండ్స్‌తో కలిసి చెట్టు వద్దకు గిటార్, పుస్తకాలతో వెళ్లడం ప్రారంభించాను. తరువాత చెట్టు చుట్టూ లైబ్రరీని ఏర్పాటు చేశాం. దీనికి నేను ట్రీ లైబ్రరీ అని పేరు పెట్టాను. ఎంతో మంది ఈ లైబ్రరీకి వచ్చి తమ ఆలోచనలు మెరుగుపరుచుకుంటున్నారు. ప్రతి ఆదివారం యూరోపియన్ ఫీల్డ్‌లో ఆర్ట్ హట్ నిర్వహిస్తాం. చాలా మంది పిల్లలు అక్కడికి వచ్చి గిటార్ ప్లే చేయటం, పాటలు పాడటం, పెయింటింగ్స్ వేయటం వంటి పోటీలలో పాల్గొంటారు. వీటితోపాటు డిబెట్ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తాం. ఈ విధంగా యువతలో ప్రతిభను పెంపొందించి, అభివృద్ధి మార్గంలో నడిపించే ప్రయత్నాలు చేస్తున్నాం. దీంతో ఆ ప్రాంతంలో చట్ట విరుద్ధ కార్యక్రమాలను నివారించాం"
-సమరిటన్ నిమేష్ లామా, ట్రీ లైబ్రరీ రూపకర్త
ఇలా చొరవ తీసుకొని తమ గ్రామ అభివృద్ధికి నిమేష్ తోడ్పడిన తీరుకు ఆ గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను చదివిన ఓ నవలతో తనకు ఈ ప్రేరణ వచ్చిందని నిమేష్ అన్నారు. నిమేష్ 2021లో జోయ్‌గర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం డబ్ల్యూబీసీఎస్ కోసం సిద్ధమవుతున్నారు. అతని తల్లి రేణుక లామా ఐసీడీఎస్‌లో పనిచేస్తున్నారు. ట్రీ లైబ్రరీ గురించి స్థానిక యువకుడు దర్పణ్ థాపా మాట్లాడుతూ.. "నిమేష్ నాకు ఫోన్ చేసి తన ఆలోచనను నాతో పంచుకున్నారు. అతని మాటలు విని ఇక్కడికి వచ్చాను. అప్పుడు చెట్టు చుట్టూ లైబ్రరీ చూసాను. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకు ముందు ఇక్కడికి చాలా మంది జూదం, మద్యం సేవించేందుకు వచ్చేవారు. అయితే వీరందరినీ మంచి మార్గంలో నడిపించాలనే ఆలోచనలో నేనూ భాగస్థుడినయ్యాను. ప్లాస్టిక్ నిర్మూలనకు, పిల్లల ప్రతిభను పెంపొందించేందుకు, పిల్లలను పుస్తక పఠనం వైపు ఆకర్షించడానికి మేము ఇక్కడ పని చేస్తున్నాము. పిల్లలు ఇక్కడికి వచ్చి వారి ప్రతిభను కనబరచాలని మేము కోరుకుంటున్నాము. మేము పిల్లలతో ఆడుతూ, పాడుతూ.. డ్రాయింగ్ కూడా నేర్పిస్తున్నాం. చెట్ల నుంచి తాళ్లతో ఒక పుస్తక ఊయల కూడా తయారు చేశాం. పిల్లల శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వ్యాయామం చేయిపిస్తున్నామని" ఆయన తెలిపారు.