నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసు దర్యాప్తు అధికారి సమీర్ వాంఖడేపై పదునైన విమర్శలు చేస్తూ వస్తున్న మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ వాటి జోరు మరింత పెంచారు. బెదిరింపుల ద్వారా కోట్లాది రూపాయలను సంపాదించిన సమీర్.. ఖరీదైన జీవితం గడుపుతారని ఆరోపించారు. సమీర్ రూ.లక్ష విలువైన ప్యాంటు, రూ.70వేల విలువైన చొక్కా, 25లక్షల నుంచి 50 లక్షల రూపాయల విలువైన చేతి గడియారం ధరిస్తారని అన్నారు. నిజాయితీ గల అధికారులు అంత విలువైన వాటిని ఎలా ధరించగలరని నవాబ్ మాలిక్ ప్రశ్నించారు. వ్యక్తులను తప్పుడు కేసుల్లో ఇరికించి బెదిరింపుల ద్వారా డబ్బులు వసూలు చేసేందుకు సమీర్ వాంఖడే ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు.
ఈ ఆరోపణలను సమీర్ వాంఖడే ఖండించారు. తాను ఖరీదైన దుస్తులు ధరించలేదని, ఈ విషయాలపై సరైన అవగాహన లేకే మంత్రి ఇలా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు.
'కొంతమంది మధ్యవర్తులు మమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించి గతేాడాది ముంబయి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. అందులో ఏమీ లేదని తేలింది. ఆ తర్వాత నుంచి సల్మాన్ అనే డ్రగ్ సరఫరాదారు ద్వారా మా కుటుంబాన్ని ట్రాప్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ కేసులో సల్మాన్ నా సోదరిని సంప్రదించాడు. ఆమె అతడ్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. ఆ తర్వాత వేరే మధ్యవర్తులతో సల్మాన్ మమ్మల్ని ట్రాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఓ కేసులో అరెస్టయి ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నాడు. అతని వాట్సాప్ చాట్ షేర్ చేసి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు' అని వాంఖడే వివరణ ఇచ్చారు. ఇదంతా డ్రగ్స్ మాఫియా చేస్తున్న పని అన్నారు.
ఇదీ చదవండి: 'ద్రవ్యోల్బణం.. మోదీ సర్కారు దీపావళి కానుక'