కరోనా రెండో దశ సృష్టించిన అల్లకల్లోలం నుంచి భారత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో మూడో దశ ముప్పు వార్తలు దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇక డెల్టా వేరియంట్ ఇప్పటికీ కలవరపెడుతూనే ఉంది. ఇది చాలదన్నట్లు.. ప్రజల నిర్లక్ష్యం నిత్యం కనపడుతూనే ఉంది. కరోనా కట్టడికి ప్రధాన ఆయుధాలైన మాస్కులు, భౌతికదూరాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరాన్ని పాటించకుండా ప్రజలు రోడ్ల మీద కనపడుతున్నారు.
ఇక రాష్ట్రాల్లో నిబంధనలు సడలించిన క్రమంలో.. అప్పటివరకు ఇళ్లల్లో ఉన్న ప్రజలు అదే పని మీద ప్రయాణాలు మొదలుపెట్టేశారు. పర్యటక ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. కరోనాకు ముందు ఇది మంచి విషయమే. కానీ మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో పర్యటక ప్రాంతాల్లో రద్దీ తీవ్ర కలవరపెడుతోంది. హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్రలో ప్రజలు ఆయా ప్రాంతాలకు పోటెత్తడానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పటికే వైరల్‌గా మారాయి.
ఇక మూడో దశలో చిన్నారులకు ముప్పు పొంచి ఉందని అనేకమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇది నిర్లక్ష్యంగా ఉండాల్సిన సమయం కాదు. పెద్దలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది. పిల్లలతో పాటు పెద్దలు కూడా త్వరితగతిన టీకాలు వేయించుకోవాలి. ఇతరులను టీకా వేసుకునే విధంగా ప్రోత్సహించాలి. మాస్కులు ధరించి, భౌతికదూరాన్ని పాటిస్తేనే మూడో దశ తీవ్రత తగ్గుతుంది. అప్పుడే దేశం కరోనా గండం నుంచి బయటపడుతుంది.
టీకాతోనే 'రక్ష'..
- కరోనాలో వెలుగు చూసిన వేరియంట్లన్నింటిలో అత్యంత ఎక్కువ సాంక్రమిక శక్తిని ప్రదర్శిస్తోంది డెల్టా వేరియంట్.
- డెల్టా వేరియంట్ కారణంగా.. కొవిడ్-19 బారినపడి కోలుకున్న వారిలోనూ రెండోసారి వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉంటోంది.
- టీకా రెండు డోసులతో వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ నుంచి కోలుకున్నవారిలో వృద్ధి చెందే యాంటీబాడీలతో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే ఎక్కువ యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు తాజా పరిశోధనల్లో తేలింది.
- వచ్చే నెలలో పిల్లలకు కరోనా టీకా అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా వెల్లడించారు.
- ఇప్పటికే గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ టీకా చిన్నారులపై ప్రయోగాలు పూర్తయ్యాయి. పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్ సైతం త్వరలోనే పూర్తి కానుందని తెలుస్తోంది.
- దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. మరో ఐదు వ్యాక్సిన్లు ప్రయోగ దశల్లో ఉన్నాయి. దేశంలో తమ వ్యాక్సిన్లను విడుదల చేసేందుకు ఫైజర్, మోడెర్నా కూడా ప్రయత్నిస్తున్నాయి.
ఇదీ చదవండి: