UP Assembly polls 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు 54.98 శాతం ఓట్లు పోలయ్యాయి.
అవధ్, పూర్వాంచల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 12 జిల్లాల్లోని 61 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 692 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ దఫా ప్రయాగ్ రాజ్, అమేఠీ, రాయ్ బరేలీ, అయోధ్య వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరిగింది.
ఓటేసిన ప్రముఖులు..
సిరతు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. ప్రయాగ్‌రాజ్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన యూపీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్షనేత ఆరాధన మిశ్రా సంగ్రామ్గఢ్లో ఓటు వేశారు.
ఎస్పీ అభ్యర్థి కాన్వాయ్‌పై దాడి..
ప్రతాప్‌గఢ్ కుందా స్ధానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి గుల్షన్ యాదవ్ కాన్వాయ్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో గుల్షన్ యాదవ్ తప్పించుకున్నారు. దుండగుల దాడిలో వారి వాహనం ధ్వంసమైంది.
మార్చి 10న ఫలితాలు..
403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరుగుతుండగా ఐదో విడతతో మొత్తం 292 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. మార్చి 3, 7 తేదీల్లో 6, 7 విడతల పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన చిన్నారి.. వీడియో వైరల్!