నవాపుర్ రైల్వే స్టేషన్.. ఇదో వింతైన రైల్వే స్టేషన్. టికెట్ కౌంటర్ కిటికీ మహారాష్ట్రలో ఉంటే.. స్టేషన్ మాస్టర్ మాత్రం గుజరాత్లో కూర్చుంటారు. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే ఈ స్టేషన్.. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల సరిహద్దులో ఉంది. స్టేషన్ కొంత భాగం మహారాష్ట్రలో ఉంటే.. మిగిలినది గుజరాత్లో ఉంటుంది. రెండు రాష్ట్రాలను విభజించే ఈ రైల్వే స్టేషన్.. రెండు ప్రాంతాలను మాత్రం కలుపుతుంది. దేశంలో ఈ ఒక్క రైల్వే స్టేషన్‌కే ఈ ప్రత్యేకత ఉంది.
ఈ రైల్వే స్టేషన్.. మొత్తం 800 మీటర్ల పొడవు ఉంటుంది. అందులో 500 మీటర్లు గుజరాత్‌లోని తాపి జిల్లాలో ఉండగా.. మిగతా 300 మీటర్లు మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఉంటుంది. స్టేషన్లో మొత్తం నాలుగు రైల్వే ట్రాక్‌లు.. మూడు ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.
స్టేషన్‌లోని బెంచ్ కూడా ప్రత్యేకమే..
బెంచ్‌లో సగ భాగం మహారాష్ట్రలో ఉంటే.. మరో సగం గుజరాత్లో ఉంటుంది. బెంచీ మధ్యలోంచి మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దు రేఖ వెళ్లింది. బెంచీ మీద కూడా రెండు వైపులా రెండు రాష్ట్రాల పేర్లుంటాయి. దాంతో ఓ వైపు కూర్చుంటే మహారాష్ట్రలోనూ మరోవైపు కూర్చుంటే గుజరాత్‌లోనూ ఉన్నట్లన్నమాట. దీంతో చాలా మంది ప్రయాణికులు, పర్యటకులు ఇక్కడ కూర్చుని సెల్ఫీలు దిగుతారు. బెంచీకి అటువైపూ ఇటువైపూ నిలబడి సరదాగా ఫొటోలు తీసుకుంటుంటారు. ఒకే బెంచ్‌లో కూర్చుని రెండు రాష్ట్రాల అనుభూతిని పొందుతారు. మాజీ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా.. గతంలో ఈ బెంచీ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసి "రాష్ట్రాలు విడగొట్టాయి.. రైల్వే కలిపింది" అనే క్యాప్షన్ యాడ్ చేశారు.
నాలుగు భాషల్లో ప్రకటనలు..
ఈ స్టేషన్లో రైల్వే సిబ్బంది సైతం గుజరాతీ, మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రకటనలు చేస్తారు. బోర్డులు, సూచికలు మొదలైనవి కూడా ఈ నాలుగు భాషల్లోనే ఉంటాయి. దీంతో రెండు రాష్ట్రాల ప్రయాణికులు.. స్టేషన్ సిబ్బంది సూచనలను సులువుగా అర్ధం చేసుకుంటారు.
ఈ రైల్వే స్టేషన్‌ను 1961 మే 1వ తేదిన నిర్మించారు. అప్పటికి మహరాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఇంకా ఉమ్మడిగానే ఉన్నాయి. ఆ సమయంలో ఈ రెండు ప్రాంతాలను కలిపి.. ముంబయి ప్రావిన్స్‌గా పిలిచేవారు. విభజనం అనంతరం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ నవాపుర్ రైల్వేస్టేషన్ ఎటూ కాకుండా మధ్యలో నిర్మించటం వల్ల.. దీన్ని కూడా ఇరు రాష్ట్రాలు పంచుకున్నాయి. పంపకాల్లో ఇలా 500 మీటర్లు గుజరాత్‌కు.. 300 మీటర్లు మహారాష్ట్రకు కేటాయించారు. అప్పటి నుంచే ఈ రైల్వే స్టేషన్ ప్రత్యేక గుర్తింపు పొందింది.