TTD Tirumala Venkateswara Swamy Total Assets : తిరుమలలో వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు. తాము కోరిన కోరికలను తీర్చినందకు ప్రతిగా.. భక్తులు స్వామి వారికి బంగారం, వెండి, నగదును కానుకలుగా సమర్పిస్తుంటారు. ప్రతీ సంవత్సరం స్వామి వారిని దర్శనం చేసుకునే భక్తుల సంఖ్యతో పాటు, శ్రీవారి సంపద కూడా పెరుగుతూనే ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి భక్తులు సమర్పించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలు, బంగారం నిల్వల గురించిన విషయాలను వెల్లడించింది. మరి, ఆ లెక్కల ప్రకారం.. శ్రీవారి మొత్తం ఆస్తుల వివరాలు ఎంతో మీకు తెలుసా? బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు గత నాలుగేళ్లలో ఎంత పెరిగాయో తెలుసా? ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించిన ఆస్తుల వివరాలు..
Tirumala Tirupati Devasthanam Total Properties : 2023 అక్టోబర్ 31 వరకు వివిధ బ్యాంకుల్లో.. స్వామివారి సంపద ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో 17,816.15 కోట్లు ఉన్నట్టు టీటీడీ వెల్లడించింది. ఇందులో.. 4,791.06 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు.. 2019 జూన్ 30 నుంచి 2023 అక్టోబర్ 31 మధ్య పెరిగాయని తెలిపింది. బంగారం డిపాజిట్ల విషయానికి వస్తే.. ఇప్పటి వరకూ 11,225.66 కేజీలు ఉన్నట్టు తెలిపింది. ఇందులో.. 3885.92 కేజీల గోల్డ్ డిపాజిట్లు 2019 జూన్ 30 నుంచి 2023 అక్టోబర్ 31 పెరిగినట్టు తెలిపింది. శ్రీవాణి ట్రస్టుకు భక్తులు ఇప్పటివరకు రూ.1,021 కోట్ల విరాళాలు అందించారని వెల్లడించింది.
ఆలయాల నిర్మాణం..
ఇప్పటివరకు టీటీడీ ఆధ్వర్యంలో.. 550 ఆలయాలను నిర్మించినట్టు వెల్లడించింది. మూడు వేలకు పైగా ఆలయాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపింది. 176 పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేపట్టినట్టు వివరించింది. వైజాగ్, భువనేశ్వర్, జమ్మూ తదితర ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించామని వెల్లడించింది. దాతల సహకారంతో రూ.140 కోట్లతో తిరుమలలో మ్యూజియం ఆధునికీకరిస్తున్నామని, రూ.25 కోట్లతో అలిపిరి నడక మార్గంలో పైకప్పును నిర్మించామని టీటీడీ చెప్పింది. రూ.25 కోట్లతో పరకామణి భవనం, రూ.15 కోట్లతో బర్డ్ ఆసుపత్రిలో నూతన వైద్యపరికరాలు ఏర్పాటు చేసినట్టు తెలియజేసింది.
వీటితోపాటు శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో రెండు వేలకు పైగా గుండె ఆపరేషన్లు చేశామని, ఎనిమిది గుండె మార్పిడి ఆపరేషన్లు చేశామని, చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రూ.175 కోట్ల విరాళాలు అందాయని వివరించింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ను విస్తృతంగా భక్తుల్లోకి తీసుకెళ్లామని, భక్తులు స్వచ్ఛందంగా రూ.50 కోట్లకు పైగా విరాళాలు అందించారని తెలిపింది. శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో రూ. 77 కోట్లతో నూతనంగా కార్డియో, న్యూరో బ్లాక్‌ను నిర్మిస్తున్నామని, అదే విధంగా రూ.197 కోట్లతో నాలుగేళ్లలో దశలవారీగ మొత్తం భవనాలను ఆధునీకరిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
TTD Job Notification 2023 : తిరుమల తిరుపతి దేవస్థానంలో పర్మనెంట్ ఉద్యోగాలు.. భారీగా వేతనాలు!