Tirumala Special Darshan Tickets For January 2024 : తిరుమలలో కొలువైన కలియుుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తుంటారు. అలాగే కాలి నడకన తిరుమల కొండెక్కి.. శ్రీవారి దర్శనం చేసుకునే వారి సంఖ్య కూడా వేలల్లో ఉంటుంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని భక్తులు.. మరింత ప్రీతిపాత్రంగా సేవించుకునేందుకు పలు ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే ప్రతినెల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారి కోసం ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. తాజాగా కొత్త సంవత్సరం 2024 జనవరిలో శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికోసం ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శన టికెట్లు, అంగప్రదక్షిణం టికెట్లు, వసతి గదులు ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు టీటీడీ షెడ్యూల్ విడుదల చేసింది.
Tirumala Rs.300 Special Darshan Tickets : తిరుమల కొండపై శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన పలు రకాల టికెట్లను ప్రతినెల టీటీడీ విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే నూతన సంవత్సరం 2024 జనవరి నెలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన లాంటి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్(Seva Electronic Dip TTD 2023) రిజిస్ట్రేషన్ టికెట్ల కోటాను ఈనెల(అక్టోబర్) 18వ తేదీ 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇవి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
Tirumala Arjitha Seva Tickets for January 2024 : శ్రీవారి ఆర్జిత సేవలైన.. ఊంజల్ సేవ, కళ్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల అవుతాయి. అలాగే 500 రూపాయలు, 1000 రూపాయల వర్చువల్ సేవా టికెట్లు అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. జనవరికి సంబంధించిన అంగ ప్రదక్షిణం టికెట్లను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్(బ్రేక్ దర్శనం) టికెట్లు అదేరోజు 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
ఈనెల 24న తిరుమల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల : అదే విధంగా ఈ నెల 24న ఉదయం 11 గంటలకు స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు(రూ.300 దర్శన టికెట్లు) రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి... దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని పేర్కొంది. ఈనెల 25 ఉదయం 10 గంటలకు తిరుపతిలో గదుల కేటాయింపు (Tirumala Accommodation Rooms Release), 26న తిరుమలలో గదుల కేటాయింపు స్లాట్లను విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వెల్లడించింది. నూతన సంవత్సరం 2024 జనవరిలో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు ఈ విషయాలను గమనించి పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం.. ఆన్లైన్లో TTD అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.inలో మాత్రమే దర్శన టికెట్లు, సేవా టికెట్లు, వసతి గదుల్ని బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
మరోవైపు ఈనెల 15 నుంచి 23వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పండగ సెలవుల నేపథ్యంలో తిరుమల(Tirumala)కు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటోంది. ఈ బ్రహ్మోత్సవాలకు రోజూ లక్షమంది భక్తులు తిరుమలకు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తోంది.