ఆయనొక జిల్లా సబ్ కలెక్టర్.. పుట్టుకతో దృష్టిలోపం ఉన్నప్పటికీ అద్భుతమైన తెలివితేటలతో మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందారు. సబ్ కలెక్టర్‌గా పోస్టింగ్ కొట్టి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తన మంచి మనసు చాటుకున్నారు. కేరళకు చెందిన ఆయన ప్రస్తుతం తమిళనాడులో విధులు నిర్వర్తిస్తున్నారు.
తిరునల్వేలి సబ్ కలెక్టర్ గోకుల్.. 200 మంది దివ్యాంగ విద్యార్థులు ఉచితంగా లగ్జరీ ధియేటర్లో మూవీ చూసేందుకు అవకాశం కల్పించారు. ప్రత్యేక ఏర్పాటు చేసి 'పొన్నియన్ సెల్వన్-1' సినిమాని చూపించారు. ఆ 200 మందిలో అంధులు, బధిరులు ఉండడంవల్ల గోకుల్.. థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి.. ప్రత్యేకంగా బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పిల్లలంతా ఎంతో సరదాగా చిత్రాన్ని తిలకించారు.
"వికలాంగులకు అన్ని విషయాల్లోనూ సమాన హక్కులు కల్పించాలి. ఈ మూడు గంటల సినిమాను వారంతా ఎంతో ఎంజాయ్ చేస్తూ చూశారు. మూవీ అనంతరం వారు ఆనందంగా బయటకు వచ్చారు. కలలో కూడా వారు ఇంత సంతోషంగా ఉంటారని అనుకోలేదు. వారి ముఖాల్లో ఆ ఆనందం కనిపిస్తోంది. సాధారణంగా వారికి విద్యలో మాత్రమే సమాన అవకాశాలు కల్పిస్తారు. కానీ వారికి వినోదం, క్రీడల్లో కూడా సమాన అవకాశాలు కల్పించాలి. అందుకే నేను ఈ ప్రయత్నం చేశాను.'
-- గోకుల్, తిరునెల్వేలి సబ్ కలెక్టర్
"నేను నా జీవితంలో ఎప్పుడూ థియేటర్‌కు వెళ్లలేదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఏర్పాటు చేయాలి" అంటూ ఓ విద్యార్థి ఆనందాన్ని పంచుకున్నాడు. మొత్తానికి తమకు ఈ అవాకశం కల్పించినందుకు గోకుల్‌కు ధన్యవాదాలు తెలిపారు విద్యార్థులు.