రైల్వే ఆస్తులకు నష్టం కల్గిస్తున్న నేపథ్యంలో వాటిని పరిరక్షించేలా సంబంధిత చట్టాలను కఠినతరం చేస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ దిశగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. నిరసనకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హితవు పలికారు. రైల్వే మన సొంత ఆస్తి అని అర్థం చేసుకోవాలని సూచించారు. విమానాల్లో ప్రయాణించే స్థోమత లేని వారికి రైల్వేలు సేవలు అందిస్తున్నాయని వివరించారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, రైలు సేవలకు అంతరాయం కల్గించడం పరిష్కార మార్గం కాదని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. నిరసనకారులు లేవనెత్తుతున్నఅన్ని అంశాలను కేంద్రం ఆలకించి పరిష్కరిస్తుందని తెలిపారు.
సైన్యంలో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన 'అగ్నిపథ్' పథకంపై యువకులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం.. సికింద్రాబాద్‌లో ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైల్వేశాఖ వివిధ జోన్లలో ప్రయాణించే రైలు సర్వీసుల్లో మార్పులు చేసింది. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. కొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసింది. మరికొన్ని రైళ్లను మార్గం మళ్లించింది. ఇప్పటివరకు ప్రభావితమైన మొత్తం రైళ్ల సంఖ్య 340గా ఉందని అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా 200 రైళ్లను రద్దు చేశారుు..
ఇదీ చూడండి : అగ్నిపథ్‌పై ఆందోళనలు.. కేంద్రం మరో కీలక నిర్ణయం