Congress chintan shivir: పూర్వవైభవ సాధనకు కాంగ్రెస్ సర్వసన్నద్ధమైంది. దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యేందుకు కొంగొత్త కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమరశంఖం పూరించింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా జరిగిన ‘నవసంకల్ప చింతన శిబిరం’లో అంతర్గతంగా పలు తీర్మానాలు చేసుకుంది. ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూనే.. శాంతి, సామరస్యాలను పెంపొందించాలన్న ధ్యేయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ‘భారత్ జోడో(సమైక్య)’ పేరుతో అక్టోబరు 2 (గాంధీ జయంతి) నుంచి యాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నిరుద్యోగంపై పోరు కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోజ్‌గార్ పాదయాత్ర చేపట్టాలని కూడా తలపెట్టింది. ఆగస్టు 15న మొదలుకానుంది.
Congress bharat jodo: వ్యవస్థాగత బలోపేతానికీ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్గత సంస్కరణల కోసం ఓ కార్యదళాన్ని, సమకాలీన రాజకీయాలపై చర్చించేందుకుగాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులతో సలహా బృందాన్ని ఏర్పాటుచేయాలని తీర్మానించుకుంది. పార్టీలో యువతకు పెద్దపీట వేయాలని.. 2024 పార్లమెంటు ఎన్నికలు మొదలుకొని ప్రతి ఎన్నికల్లోనూ 50% టికెట్లను 50 ఏళ్లలోపు వారికే కేటాయించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పలు ఇతర అంశాలనూ చేర్చి ఆదివారం ‘ఉదయ్‌పుర్ డిక్లరేషన్’ను విడుదల చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై అనుమానాల నేపథ్యంలో వాటి వినియోగానికి స్వస్తి చెప్పాలని అందులో పేర్కొంది. వాటి స్థానంలో తిరిగి బ్యాలట్ పత్రాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది. మూడు రోజులపాటు నిర్వహించిన నవసంకల్ప చింతన శిబిరం ఫలప్రదమైందని.. పార్టీలో నవోదయానికి అది దోహదపడుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. తాజా శిబిరం ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆమె పలు కీలక ప్రకటనలు చేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
సామాజిక సౌభ్రాతృత్వం కోసం: దేశంలో సామాజిక సౌభ్రాతృత్వం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రాజ్యాంగ మూల విలువలు దాడికి గురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు, కోట్లమంది ప్రజలు రోజువారీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ‘భారత్ జోడో’ యాత్ర చేపట్టనున్నాం. జూనియర్, సీనియర్ అనే తేడాల్లేకుండా నాయకులంతా ఇందులో పాల్గొనాలి.
2-3 రోజుల్లో కార్యదళం: పార్టీలో అంతర్గత సంస్కరణల కోసం కార్యదళాన్ని (టాస్క్‌ఫోర్స్) ఏర్పాటుచేయనున్నాం. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. సంస్థాగత నిర్మాణం, వివిధ పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన నిబంధనలు, ప్రచారం, ఆర్థిక వనరుల సమీకరణ, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించి పార్టీలో విభిన్న కోణాల్లో మార్పులు తీసుకురావడం దాని బాధ్యత. 2-3 రోజుల్లో కార్యదళాన్ని ప్రకటిస్తాం. పార్టీ ముందున్న సవాళ్లు, సమకాలీన రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చించడానికి సీడబ్ల్యూసీ సభ్యులతో కలిపి సలహా బృందాన్ని ఏర్పాటుచేస్తాం. సీనియర్ నాయకుల అపార అనుభవం నుంచి నేను ప్రయోజనం పొందడానికి ఇది దోహదపడుతుంది. ఈ ఏడాది జూన్ 15 నుంచి జిల్లా స్థాయుల్లో రెండో విడత జన్‌జాగరణ్ యాత్ర పునఃప్రారంభిస్తాం. నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగం, పేదలకు పెనుభారంగా తయారైన ధరల పెరుగుదల వంటి ఆర్థిక అంశాలను ప్రస్తావిస్తూ ఈ యాత్ర కొనసాగిస్తాం.
"ఇప్పుడున్న అన్ని అడ్డంకులను మనం కచ్చితంగా అధిగమిస్తాం. కాంగ్రెస్ సరికొత్త ఉదయాన్ని చూసి తీరుతుంది. ఇదే మన నవ సంకల్పం."
- సోనియా గాంధీ
పార్టీలో పదవికి అయిదేళ్ల పరిమితి: పార్టీలో ఏ వ్యక్తి కూడా అయిదేళ్లకు మించి ఒకే పదవిలో కొనసాగకూడదు. పార్టీ ఆధ్వర్యంలోని అన్ని స్థాయిల కమిటీల్లోనూ 50% పోస్టులు 50 ఏళ్లలోపు వారికే ఇవ్వాలి. అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.
రెండో టికెట్ కావాలంటే: ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న సూత్రాన్ని అమలు చేయాలి. ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వాలి. అదే కుటుంబంలోని మరో వ్యక్తికి కూడా టికెట్ కావాలంటే.. ఆ వ్యక్తి పార్టీకి కనీసం ఐదేళ్లు నిరుపమాన సేవలు అందించినవారై ఉండాలి.
ఇదీ చదవండి: 'షార్ట్కట్లు లేవు.. పోరాడదాం.. తుదిశ్వాస వరకు మీతో ఉంటా!'